MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. చికిత్స అందించిన వైద్యులు..కవితకు ఏమైందంటే..
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని మరింత జోరుగా కొనసాగిస్తున్నాయి. అధికార భారతీయ రాష్ట్ర సమితి, ప్రతిపక్షం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలోని ముఖ్య నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
ఎలా గైన అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీ లు ప్రయత్నిస్తుంటే. ఈ దఫా కూడా తామే అధికారంలో ఉండాలని అధికార బి.ఆర్.ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ లోని ముఖ్య నేతలైన కేటీఆర్, హరీష్ రావు, కవితలు స్టార్ కాంపైనర్లు గా మారిపోయారు.
పలువురు బి.ఆర్.ఎస్ అభ్యర్థుల గెలుపును కోరుతూ వారి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత పర్యటనలో నేడు ఒక అపశృతి చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కవిత కళ్ళు తిరిగి పడిపోయారు. ప్రచార వాహనంలో ఉన్నప్పుడే ఆమె కాస్త ఇబ్బందికరంగా ఫీలైనట్టు తెలుస్తోంది. చూస్తూ ఉండగానే ఆమె ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు.
వెంటనే స్పందించిన మహిళా కార్యకర్తలు ఆమెకు సపర్యలు చేశారు. గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ సమయానికి అక్కడే ఉండటంతో కవితకు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అయన పేర్కొన్నారు.
డీహైడ్రేషన్ వల్ల కవిత కళ్ళుతిరిగి పడిపోయినట్లు ఆమెకు చికిత్స అందించిన డాక్టర్ల ద్వారా తెలుస్తోంది. జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్‌కు మద్దతుగా ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే కవిత తేరుకున్న అనంతరం ఎన్నికల ప్రచారాన్ని యధావిధిగా మొదలు పెట్టడం విశేషం.
ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కల్వకుంట్ల ఫ్యామిలీకి చిన్న చిన్న ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. మొన్నామధ్య రాష్ట్ర మంత్రి కేటీఆర్, బి.ఆర్.ఎస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆసమయంలో కేటీఆర్ ప్రచార రధం పై కొందరు నేతలు తో కలిసి వెళుతూ స్థానికులకు అభివాదం చేస్తున్నారు. వేగంగా వెళుతున్న ప్రచార రథం ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో పైన ఉన్న వారు పడిపోయారు. అదృష్టవశాత్తు మంత్రి కేటీఆర్ కి ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. మిగిలిన నేతలకు చిన్న చిన్న గాయాలయ్యాయి.