ధన త్రయోదశి.. హిందువులు ఎంతో గొప్పదిగా భావించే పర్వదినం ఇది. ఈ పండుగ అశ్విని మాసంలో త్రయోదశి నాడు వస్తుంది కాబట్టే దీనిని ధన త్రయోదశి అంటారు.
ఈ పండుగ రోజున బంగారం, వెండి వంటి లోహాలను కొనుగోలు చేస్తారు. అంతేకాదు బంగారంతో చేసిన ఆభరణాలను కూడా కొని ఇంటికి తెచ్చుకుని ప్రత్యేకంగా పూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.
కేవలం బంగారు వెండి వస్తువులు మాత్రమే కాదు ధనత్రయోదశి నాడు విలువైన పాత్రలు కూడా కొని తెచ్చుకుంటే, ఆఇంటికి కుబేరుని అనుగ్రహం కూడా లభిస్తుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.
దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సాగర మధనం చేసిన సమయంలో మహా విష్ణు అంశతో ధన్వంతరి జన్మించాడని, ధన్వంతరి సాగరం నుండి వచ్చే సమయంలో తనతోపాటు అమృత పాత్రలను తీసుకువచ్చాడు కాబట్టి, మనం ఆరోజన విలువైన పాత్రలు కొనుగోలు చేస్తే మన ఇంట్లో శుభాలు కలుగుతాయని చెప్తారు.
ఇక బంగారం, వెండి, నగలు, విలువైన పాత్రలతోపాటు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం వల్ల మన కుటుంబానికి ఆదాయం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని కొందరు నమ్ముతారు.
ధనత్రయోదశిని మినీ దీపావళి అని కూడా అంటారు. అందుకు తగ్గట్టు ధనత్రయోదశి నవంబర్ నెలలో 10, 11 తేదీల్లో రాగా దీపావళి 12వ తేదీన వచ్చింది.
సాధారణంగా మనం దీపావళి రోజున లక్ష్మి దేవిని వినాయకుడిని పూజిస్తాం. కాబట్టి దీపావళి ముందు రోజు ధనత్రయోదశి వచ్చింది కాబట్టి, ఆ రోజున లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలను కొనుగోలు చేస్తే మంచికి మంచి జరుగుతుంది, తరువాత రోజు దీపావళి నాడు కొత్త విగ్రహాలకు పూజ చేసుకున్నట్టు ఉంటుంది.
ధన త్రయోదశి నాడు కేవలం బంగారం మాత్రమే కొనుగోలు చేయాలని ఏమి లేదు, ఆరోజు వెండి, ఇత్తడి, రాగి వస్తువులు కూడా కొనుగోలు చేయవచ్చు.
ఇక మెరిసే వస్తువులను కొనుగోలుచేసి ఇంటికి తీసుకుని వెళ్లొచ్చని కొందరు పండితుల ద్వారా తెలుస్తోంది. అలా చేయడం వల్ల మనకు అదృష్టం కలడమే కాదు, ప్రతికూల శక్తులను తొలగించుకునే వీలుంటుంది కొందరు నమ్ముతారు.