ఒకప్పుడు తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ సినిమాల షూటింగులు అన్ని చెన్న పట్నంలోనే జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సౌత్ సినిమాల చిత్రీకరణకు హైదరాబాద్ కేంద్ర బిందువైంది. ఇక్కడ ఉన్న స్టూడియోలు లొకేషన్లు వారిని ఆకర్షిస్తున్నాయి.
కేవలం షూటింగుల కోసం హైదరాబాద్ ఆకర్షించడమే కాదు, తెలుగు సినిమా కూడా ఇతర భాషా ప్రేక్షకుల చూపును ఆకర్షించింది. ఈ క్రమంలో మంగళవారం నాడు హైద్రాబాద్‌లో సినిమాటిక్ ఎక్స్ పో ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా హాజరైన ఈ కార్యకమం ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో జరిగింది.
సినీ రంగానికి చెందిన సరికొత్త టెక్నాలజీ, యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్ వంటి విభాగాల్లో వస్తోన్న అప్ డేట్స్ మీద ఈ ఈవెంట్‌లో చర్చించారు.
అనంతరం నాగార్జున మాట్లాడుతూ 1974లో అన్నపూర్ణ స్టూడియోను ప్రారంభించామని ఆ టైంలో ఇక్కడ చిత్ర పరిశ్రమ లేదని, షూటింగ్స్ కూడా అడపా దడపా మాత్రమే జరిగేవని అన్నారు.
కానీ ఇప్పుడు ప్రతి రోజు షూటింగ్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఇక హైదరాబాద్ అయితే సినీ పరిశ్రమకు రాజధానిలా మారనుందని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ వరకు వెళ్లడంతో ప్రపంచ వ్యాప్తంగా మన సత్తా చాటామన్నారు.