No Electricity in Sri lanka : చీకటిలో శ్రీలంక అసలు ఏమైయింది????
ఒక పదినిమిషాలు కరెంటు పోతేనే.. మనం చేసే పనులన్నీ ఆగిపోతాయి. అలాంటిది ఆ దేశంలో కరెంటు సరఫరా అనే నిలిచిపోయింది. ఒక్కసారి ఊహించుకోండి ఆ దేశ ప్రజల జీవన విధానం ఎంతలా స్తంభించిపోయిందో.. నిజమే, ఇలాంటి పరిస్థితి వచ్చిన దేశం ఏమిటో తెలుసా? శ్రీలంక.
సంక్షోభంతో సతమతమవుతున్న ఆ ద్వీప దేశంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవహారాల సంస్థ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు సీఈబీ అధికార ప్రతినిధి తెలిపారు.
విద్యుత్ సరఫరా ఆగిపోవడం వల్ల ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కాట్మలే-బియగమా మధ్య ప్రధాన విద్యుత్ లైనులో సమస్య ఏర్పడడమే ఈ సరఫరా నిలిచిపోవడానికి కారణమని ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అవసరమైన చర్యలు ప్రారంభించామని, కొద్ది గంటల్లోనే పూర్తిస్థాయిలో విద్యుత్ను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది…కానీ,
ఇప్పటికే రోజులో 10 గంటల విద్యుత్ కోత తో గత కొంతకాలంగా శ్రీలంకలో కొనసాగుతున్నాయి. రోజుకు దాదాపు 10 గంటల పాటు విద్యుత్ సరఫరాలో కోత పెడుతున్నారు. అయితే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. శ్రీలంక ఎక్కువగా జల విద్యుత్ ఉత్పత్తి పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి బొగ్గు, చమురును తక్కువగా ఉపయోగిస్తారు. అయితే, వేసవి కాలంలో జలశయాలలో నీరు అడుగంటడం వల్ల బొగ్గుతో విద్యుత్పత్తిని చేయడం మొదలుపెట్టారు.
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పన్నులను కూడా పెంచారు.
అయితే, ఈ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాని ఫలితంగా ఆహారపదార్థాలు, ఔషధాలు, ఇంధనం ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. విదేశీ మారక నిల్వలు కూడా తక్కువ కావడం వల్ల ఇంధన రవాణాకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సెకు వ్యతిరేకంగా ప్రజలు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం వల్ల నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. విద్యుత్ ఛార్జీలు, ఆదాయపు పన్నులు పెంచి రాబడిని అధికం చేశారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఈ దేశంలో రావడం బాధాకరం.. ఎప్పటి వరకు చక్కబడతాయో వేచి చూడాల్సిందే