Once a PCC President now CM: పీసీసీ అధ్యక్షుడు..ఇప్పుడు సీఎం!
పదేళ్ల క్రితం..తెలంగాణ ఆవిర్భావ సమయంలో రేవంత్ రెడ్డి సీఎం కాగలరని ఎవరైనా ఊహించిఉంటారా..? ఇప్పుడు ఎంత మంది ఎన్ని చెప్పినా..అప్పటికైతే రేవంత్ సీఎం అన్నది ఎవరి ఊహకు అందనిదే.
అందుకే రేవంత్ రాజకీయ జీవితాన్ని తెలంగాణకు ముందు..తెలంగాణ తర్వాత అనే చూడాలి. రేవంత్ కు నాయకత్వ లక్షణాలున్నాయి. అందుకే ఆయన ఎక్కడైనా వేగంగా ఎదగగలిగారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత..రాష్ట్రంలో టీడీపీ ముఖచిత్రంగా రేవంత్ ఉండేవారు. ఇదే అప్పటి సీనియర్లకు కోపం తెప్పించింది. రేవంత్ తో విభేదించే కొంతమంది నేతలు టీడీపీని వీడి బీఆర్ ఎస్ లో చేరారన్నది నిజమే.
అసెంబ్లీలో దూకుడుగా వ్యవహరించినప్పటికీ..బీఆర్ ఎస్ ను నిలదీస్తున్నప్పటికీ..కేసీఆర్ కు రేవంత్ రెడ్డిని ప్రత్యర్థిగా ఎవరూ చూళ్లేదు. కేసీఆర్ స్థాయి వేరు..రేవంత్ స్తాయి వేరు అన్న తరహాలో బీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలే కాదు…
తెలంగాణ ప్రజలూ భావించేవారు. కానీ ఓటుకునోటు కేసు తర్వాతే..రేవంత్ రాజకీయ జీవితం కొత్త మలుపు తిరిగిందని చెప్పాలి. ఆ కేసు వల్ల రేవంత్ ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారో..ఎన్ని అవమానాలు పడ్డారో…ఎన్ని లాఠీదెబ్బలు తిన్నారో…అందరూ గమనించారు.
అయితే పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్తున్నప్పుడు…భయపడుతూనో..అవమానభారంతోనో…ఆందోళనతోనో రేవంత్ రెడ్డి కనిపించలేదు.
మీసం తిప్పుతూ….ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటానంటూ రేవంత్ రెడ్డి పోలీస్ జీపు ఎక్కి వెళ్లిన ద్రుశ్యం పదేళ్ల తర్వాత కూడా ఆయన అభిమానుల మస్తిష్కం నుంచి తొలగిపోలేదు.
అప్పటి టీడీపీ మద్దతుదారులు, రేవంత్ అభిమానులనే కాదు..తెలంగాణ ప్రజల్లో ఎంతో మంది…రేవంత్ పేరును ముందు ముందు గుర్తుంచుకునేలా చేసింది ఆ ద్రుశ్యం. రేవంత్ సీఎం అవ్వడానికి మొదటి పునాది పడింది అక్కడే.
కూతురు పెళ్లికి బెయిల్ మీద రావాల్సిన పరిస్థితుల నుంచి పదేళ్లకాలంలో రేవంత్ రెడ్డి రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కానీ తెలంగాణ సమాజం నుంచి ఆయనకు అందాల్సిన స్థాయిలో సానుభూతి లభించలేదన్నది ఆయన అభిమానులు చెప్పే మాట.
దీనికి ఉదాహరణగా 2018 ఎన్నికల్లో కొడంగల్ లో ఆయన ఓటమిని ప్రస్తావిస్తారు అభిమానులు. ఎన్నికల్లో గెలుపోటముల సంగతి పక్కనపెడితే..రేవంత్ రెడ్డి పార్టీల రాజకీయంలో మాత్రం ఆరితేరారనే చెప్పాలి.
తెలంగాణ టీడీపీలో సీనియర్లను దాటి..ఎలా ఆ పార్టీ ముఖచిత్రంగా మారారో…కాంగ్రెస్ లోనూ అంతే వేగంగా ఎదగడమే దీనికి నిదర్శనం. అయితే టీడీపీలో ఎక్కువకాలం ఉన్నారు. కానీ కాంగ్రెస్ లో చాలా తక్కువకాలంలోనే రేవంత్ రెడ్డి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు.
మొత్తం దేశంలోన కాంగ్రెస్ రాజకీయాల్లో ఇది ఎవరికీ సాధ్యం కాలేదని చెప్పొచ్చు. సుదీర్ఘ కాలం పార్టీలోపనిచేసి, అధిష్టానంతో అణుకువగా ఉంటేనే కాంగ్రెస్ లో ఏ పదవైనా దక్కుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే.
కానీ రేవంత్ రెడ్డి..పార్టీలో చేరి పదేళ్లయినా కాకముందే..అత్యంత కీలకమైన పీసీసీ అధ్యక్ష పదవి సాధించారు. ఆ పదవిపై తనదైన ముద్రవేసి సీఎం పదవికి ఎంపికయ్యారు. కాంగ్రెస్ లో ఇలా జరుగుతుందంటే ఎవరూ నమ్మలేరు.
ఓ రకంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు రేవంత్ రెడ్డి. కర్ణాటకలో సిద్దరామయ్య కూడా మొదటి నుంచీ కాంగ్రెస వ్యక్తి కాదు. ఆయనకు రెండుసార్లు సీఎం పదవి ఇచ్చింది.
అయితే సిద్ధరామయ్యకు బీసీ వర్గాలపై తిరుగులేని పట్టుంది. కానీ రేవంత్ రెడ్డికి క్షేత్రస్థాయిలో అంత బలం లేదు. అయినా రెండున్నరేళ్ల క్రితం పీసీసీ అధ్యక్ష పదవి పొందినట్టే…కాంగ్రస్ సీనియర్లను వెనక్కి నెట్టి సీఎం పీఠాన్ని సాధించారు.