Pollution in delhi : డేంజర్ అంచున ఢిల్లీ – రెండు రోజులు స్కూళ్లకు సెలవు.
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడి పోతోంది. ఈ వాయు కాలుష్యం కారణంగా చలి కాలం మొదలవుతుంది అంటే చాలు ఢిల్లీ వాసుల గుండె ధడ ధడ మని కొట్టుకుంటూ ఉంటుంది. ఢిల్లీ లో కురిసే మంచు వల్ల అనేక అనర్ధాలు చోటుచేసుకున్నాయి గతంలో.
ఈ విపత్కర పరిస్థితులను తొలగించాలని భావించిన ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు కూడా చేశాయి. కొన్నాళ్ల పాటు సరిసంఖ్య ఉన్న వాహనాలను మాత్రమే నడపాలని ఆతరువాత బేసి సంఖ్య ఉన్న వాహనాలను నడపాలని ఆంక్షలు విధించిన సందభాలు కూడా ఉన్నాయి.
అంతే కాక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వాయు కాలుష్యానికి పాల్పడే పరిశ్రమలపై కొరడా ఝళిపించిన సందర్భాలు కూడా చూసాం. అయినప్పటికీ హస్తినకు ఈ కాలుష్య బెడద తీరడం లేదు. అంతంత మాత్రంగా ఉన్న వాయు నాణ్యతతో ఏదోలా కాలం వెళ్లదీస్తుంటే పొరుగున ఉన్న హరియాణా, పంజాబ్‌లలో రైతులు పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు.
దీంతో ఈ వాయు కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. కాలుష్యాన్ని కట్టడి చేయడం మాట అటుంచి ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఢిల్లీ సర్కారు దృష్టి కేంద్రీకరించింది. రెండు రోజులపాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులను ప్రకటించింది.
కాలుష్యం కారణంగానే శుక్ర, శనివారాలు సెలవులు ఇచ్చినట్లు కేజ్రీవాల్ సర్కారు తెలపింది.
ఈ ఉత్తర్వులు ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే కాకుండా ప్రైయివేటు విద్యా సంస్థలకు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఢిల్లీ ప్రాంతంలో చేపడుతున్న పలు నిర్మాణ పనులపై కూడా నిషేధం విధించింది.
ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ – ఎన్‌సీఆర్ పరిధిలో అనవసరమైన నిర్మాణ కార్యకలాపాలను ఆపాలని ఆదేశించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3లో భాగంగా శీతాకాలంలో వాయుకాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు చేపడుతున్నారు. కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ నేతృత్వంలో ఢిల్లీలోకి డీజిల్ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు.
జీఆర్ఏపీ 3వ దశలో ప్రభుత్వ ప్రాజెక్టులు, మైనింగ్, స్టోన్ క్రషింగ్ మినహా అన్ని నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం ఉంటుంది. వాయు నాణ్యత పెంపునకు కృషి చేయాలని ఢిల్లీ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం వాయు నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే అది అరోగ్యానికి మంచిది, 51-100 ఉంటే అది సంతృప్తికరం, 101-200 ఉంటె అది మధ్యస్థ మైనది, 201-300 మధ్య ఉంటె దానిని పేలవమైనదిగా గుర్తిస్తారు, 301-400 ఉంటె చాలా పేలవమైనదిగా పరిగణిస్తారు, 401-500 ఉంటె దానిని తీవ్రమైనదిగా లెక్కిస్తారు.
500 కంటే ఎక్కువ ఉంటే అతి తీవ్రమైనదిగా చూస్తారు.