Prompt response in Praja Bhavan – Surgery for four-month-old baby: ఆరంభ సూరత్వం, ఆర్భాటాలకు తావివ్వకుండా ప్రజాభవన్ లో అధికారులు తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు. వివిధ కారణాలతో వివిధ సమస్యలతో వినతి పత్రాలు చేతపట్టుకుని ప్రజాభవన్(Prajabhavan) కు వస్తున్నారు.
ఆయా సమస్యల పట్ల అధికారులు స్పందించి సంబంధిత శాఖలకు ఆయా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. అయితే అక్కడి యంత్రాంగం సమస్యల తాలూకు కాగితాలు తీసుకోవడమే కాదు, కొంత మానవతా దృక్పధంతో కూడా వ్యవహరిస్తున్నారు.
అందుకు ఉదాహరణే తాజా ఉదంతం. ప్రజా భవన్ కు నేడు ఒక మహిళ నాలుగు నెలల పసికందును తీసుకొచ్చింది. ఆ మగబిడ్డకు ఉన్న సమస్య మామూలుగా అయితే అంత పెద్దదికాదు, కానీ ఆ కుటుంబం స్థోమత ను బట్టి చూస్తే అది వారికి పెద్ద సమస్యే. ఎందుకంటే వారిది రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకు కాబట్టి.
ప్రజా భవన్ నుండి నేరుగా ఆసుపత్రికి : From Prajabhavan To Hospital
పాసిబిడ్డకు ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో చాలా ఆసుపత్రులకు తీసుకెళ్లారు. వైద్యులు బిడ్డ గుండెలో రంధ్రం ఉందని శస్త్ర చికిత్స చేయడం అత్యవసరమని చెప్పారు.
అందుకు లక్ష రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. కానీ లక్ష రూపాయలు అంటే వారి స్థోమతకు అది చాలా పెద్ద మొత్తం. కాబట్టి ఆ నిరుపేద ఇల్లాలు ఆమె బిడ్డను తీసుకుని ప్రజా భవన్ కు వెళ్ళింది. ఆమె అక్కడ ఉన్న నోడల్ అధికారిని కలిసింది.
తన సమస్య తెలియజేసింది. వెంటనే స్పందించిన నోడల్ అధికారిని అక్కడే ఉన్న వైద్యులకు శిశివు బాధ్యతలు అప్పగించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శిశువు గుండెకు శస్త్ర చికిత్స చేయించేందుకు ఆరోగ్యశ్రీ కింద గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆరోగ్యశ్రీ కింద గుండెకి శస్త్ర చికిత్స : Surgery Under Aarogyasri Scheme
ప్రజా భవన్ లోనే ఉన్న అంబులెన్స్ లో తల్లి బిడ్డలను బంజారాహిల్స్ లో గల స్టార్ ఆసుపత్రికి తరలించారు. అంతేకాక శిశువు ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలను స్టార్ ఆసుపత్రి వైద్యులకు సమాచారం అందించారు.
తన బిడ్డకు శస్త్ర చికిత్స జరగబోతుండటం పట్ల ఆ తల్లి సంతోషాన్ని వెలిబుచ్చింది. ఇక ఈ ఉదంతం చూసిన ప్రజా భవన్ లోని ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేశారు.