
Rajahmundry Road Cum Rail Bridge : మోక్షం నుంచి రాజమండ్రి కొవ్వూరు రోడ్డు, రైలు వంతెన – వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి
రాజమహేంద్ర వరం, కొవ్వూరు పట్టణాలను కలుపుతూ ఒక పెద్ద వంతెన ఉంటుంది. అదే రోడ్డు కం రైలు వంతెన. ఈ వంతెన కింద భాగంలో రైలు వెళుతుంది, పైన భాగంలో బస్సులు లారీలు వంటి ఇతరత్రా అన్ని రకాల వాహనాలు వెళతాయి. ఈ వంతెనపై నుండి భారీ వాహనాలు కూడా ప్రయాణం చేయవచ్చు. కానీ ఈ వంతెనను కొన్నాళ్ల పాటు మూసి వేశారు అధికారులు. అందుకు కారణం రైల్ కం రోడ్డు వంతెన లో రోడ్డు మార్గం బాగా దెబ్బ తినడమే. ఈ మరమ్మత్తులు చేపట్టేందుకు సర్కారు 2.10 కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే ఇప్పుడు ఈ వంతెన పై రాకపోకలు నిషేధించడం వల్ల కొవ్వూరు, కొవ్వూరు చుట్టు ప్రక్కల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
వంతెనపై ఉన్న తారు రోడ్డును పూర్తిగా తీసివేసి మరలా రోడ్డు నిర్మించారు. నిర్మాణ సమయం లో ఆటంకాలు ఎదురవకుండా ఉండేందుకు బ్రిడ్జిపై భారీ వాహన రాకపోకలను నిలువరించారు. అందుకోసం కొవ్వూరు టోల్‌గేటు వద్ద ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేశారు. ఈ ఇనుప గడ్డర్ల ఏర్పాటు వల్ల పల్లెవెలుగు ప్యాసింజర్ బస్సులు తప్ప క్యారేజ్ ఉన్న బస్సులు, ఎక్స్‌ప్రెస్, వోల్వో బస్సులు ప్రయాణాలు సాగించడానికి వీలు ఉండదు. ఇటువంటి భారీ వాహనాలు మొత్తం కూడా గామన్ వంతెన మీదుగా ప్రయాణాలు సాగించాయి. దీంతో విజయవాడ, హైదరాబాద్ బస్సులతోపాటు, అటు విశాఖపట్నం వైపుల నుంచి వచ్చే ఏ బస్సు కూడా కొవ్వూరు టౌన్‌లోకి రావడం లేదు. ఇప్పటికే కోవిడ్ పుణ్యమా అని కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో రైళ్ల స్టాపింగులు కూడా నిలుపుదల చేశారు.
అటు రైళ్లు, ఇరు ఎక్స్ ప్రెస్ బస్సులు అందుబాటులో లేకపోవడంతో కొవ్వూరు ఆ ప్రాంత చుట్టుప్రక్కల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రస్తుతం వాహనాలు రాకపోకలు పునరుర్ధరించడంతో ఆ వంతెనను జిల్లా కలెక్టర్ కె.మాధవీలత పరిశీలించారు.