Renter scammed owner with aadhar cards : ఇంటి ఓనర్ కే కుచ్చు టోపీ పెట్టిన ఘనుడు. ఓనర్ ఆధార్ నంబర్ తో బ్యాంకు అకౌంట్
సాధారణంగా మనం ఎవరికైనా అవసరం అయిందంటే ఆధార్ కార్డు ఇచ్చేస్తాం, బాగా తెలిసిన వారే కదా, లేదంటే మన పక్క ఇంట్లోనే ఉంటున్నారు కదా, మన ఇంట్లోనే మరో పోర్షన్లో అద్దెకు ఉంటున్నారు కదా అని నమ్మి వారికి సహాయం చేస్తాం. కానీ అక్కడ మనం పెద్ద తప్పు చేస్తున్నామని మనకు తెలియదు. తీరా అనర్ధం తలెత్తాక కానీ అర్ధం కాదు మనకు, మనం చేసింది చిన్న తప్పు కాదని. ప్రస్తుత సమాజంలో మంచికి పొతే ముంచేవాళ్ళు ఎదురవుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది.
గ్యాస్ కనెక్షన్ కోసం అవసరం అంటూ ఇంటి యజమాని ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని, తీరా ఆమె నెత్తి మీదే కుచ్చు టోపీ పెట్టాడు ఒక ప్రబుద్దుడు. దీని వల్ల ఆమెకు ప్రభుత్వం అందించే సంక్షేమ పధకాలు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. విశాఖనగరం లోని కంచరపాలెంలో నివాసం ఉంటున్న పద్మావతి అనే మహిళ తన ఇంటిని జి. నాయుడు అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చింది. కొన్నాళ్ల పాటు అద్దెకు ఉన్న నాయుడు 2020 సంవత్సరంలో ఇల్లు ఖాళీ చేశాడు. అయితే వెళ్లిపోయే సమయంలో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ మార్చేందుకు అడ్రస్సు ప్రూఫ్ తో అవసరం ఉందని అందుకు ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్పాడు.
ఆ మాటలను అమాయకంగా నమ్మేసిన పద్మావతి ఆధార్ జిరాక్స్ అతని చేతిలో పెట్టేసింది. అదే అదునుగా నాయుడు ఆ ఆధార్ నంబర్ తో గాజువాకలోని ఓ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆ అకౌంట్ ద్వారా పెద్ద మొత్తంలో లావా దేవీలు చేస్తున్నాడు. పరిమితికి మించి లావాదేవీలు జరిగితే వారికి సంక్షేమ పధకాలు ఆపేయబడతాయి. పద్మావతి విషయం లో కూడా అదే జరిగింది. కానీ మొదట్లో ఆమెకు సంక్షేమ పధకాలు ఎందుకు నిలిచిపోయాయి అర్ధం కాక తలపట్టుకుంది పద్మావతి. తీరా లోతుగా దర్యాప్తు చేస్తే గాని అసలు విషయం తెలియలేదు. గాజువాక లోని ఓ బ్యాంకు లో ఆమెకు అకౌంట్ ఉందని ఆ అకౌంట్ ద్వారా డబ్బు లావాదేవీ జారుతోందని తెలిసింది. కానీ తానెప్పుడూ గాజువాక లో అకౌంట్ తెరవాలేదని పద్మావతి తెలిపింది. కానీ బాగా ఆలోచించగా ఆమె ఆధార్ కార్డు జిరాక్స్ నాయుడు చేతికి ఇచ్చినట్టు జ్ఞాపకం తెచ్చుకుంది.
దీంతో నాయుడే ఈ పనిచేశాడని పద్మావతి నిర్ధారణకు వచ్చింది. వెంటనే ఆమె కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు ఆధార్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. పరాయి వారికి ఎవ్వరికి కూడా ఆధార్ కార్డు ఇవ్వకూడదని చెబుతున్నారు.