What Revanth will do for state: రేవంత్ రెడ్డి..రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు..
తెలంగాణ తొలి కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి ఎంపిక అనూహ్యమేమీ కాదు. తొలి నుంచీ అనుకుంటున్నదే. అయితే దేశప్రజలకు కాంగ్రెస్ రాజకీయాలపై సమగ్ర అవగాహన ఉండడంతో చివరి వరకు రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగింది.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో రోజంతా మంతనాల తర్వాత…ముందే చెప్పినట్టుగా మల్లికార్జున ఖర్గే ప్రకటనకు కట్టుబడి….సీఎల్పీ సమావేశం జరిగిన మరుసటిరోజే ముఖ్యమంత్రి ప్రకటన జరిగిపోయింది.
ఈ ప్రకటన అధికారికంగా రావడానికి ముందు నుంచీ..చెప్పాలంటే ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పటి నుంచీ..ఓ అంశం గురించి తెలంగాణలో విస్త్రుతంగా ఓ అంశంపై చర్చ జరుగుతోంది.
అది..రేవంత్ సహా కొందరు నేతలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏమయ్యారని.? ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం పోరాడని వారిని ఎన్నికల్లో ఎలా గెలిపిస్తారని..? బీఆర్ ఎస్ ఈ అంశంపై ప్రచారం చేసినప్పటికీ…ప్రజలు అంతిమంగా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు.
అయినప్పటికీ ఈ అంశం ఎప్పటికీ చర్చనీయాంశమే. అయితే ఇక్కడ ఓ అంశాన్ని గమనించాలి. రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం భారీ స్థాయిలో పోరాడలేదన్నది నిజమే. తెలంగాణ అస్తిత్వ గుర్తింపుగా రాష్ట్ర ఏర్పాటుకు ముందు రేవంత్ లేరన్నదీ నిజమే.
కానీ ఆయనెప్పుడూ తెలంగాణ వాదే. తెలంగాణ కోసమే ఆయన రాజకీయాలు సాగాయి. దాదాపు అన్ని పార్టీలు బలపరిస్తేనే తెలంగాణ ఏర్పడింది.
ఈ రకంగా తెలంగాణ ఏర్పాటులో…ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తపరిచిన ప్రతి పౌరునికీ పాత్ర ఉన్నట్టే..రేవంత్ రెడ్డికీ ఉంది.
అలాగే ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. తెలంగాణ ఏర్పడి పదేళ్లయింది. పదేళ్ల తర్వాత కూడా ఉద్యమ నేపథ్యంతోనే రాజకీయాలు సాగాలనుకోవడం సరైనది కాదు. రాష్ట్ర ఏర్పాటుతోనే భావోద్వేగాలకు తెరపడిపోయింది.
పదేళ్ల తర్వాత కూడా ఆ భావోద్వేగాలతోనే రాష్ట్ర రాజకీయాలను ముందుకు తీసుకెళ్లడం కుదరదు. ఇప్పుడు తెలంగాణ కూడా అన్ని రాష్ట్రాల్లాంటిదే. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో ఉండే రాజకీయ పరిస్థితులే ఇక్కడ కూడా ఉంటాయి. తెలంగాణ ప్రజలు ఆ విజ్నతతోనే ఓటేశారు.
కాంగ్రెస్ కు అవకాశం కల్పించారు. అధికార, ప్రతిపక్షాలకు, ప్రజాస్వామ్యానికి అసలైన నిర్వచనమైన బహుళపార్టీల రాజకీయాలకు తెలంగాణలో స్థానం ఉంటుందని స్పష్టం చేశారు.
ఉద్యమపార్టీగా, పదేళ్లగా అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ ఎస్ తెలంగాణకు చేసిందేదీ ప్రజలు మర్చిపోలేదు. ఉద్యమాలను, అభివ్రుద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను గుర్తుంచుకున్నారు కాబట్టే..ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మరీ బీఆర్ ఎస్ గౌరవప్రదమైన స్థానాల్లో గెలుపొందేలా చేశారు.
అదేవిధంగా…బీజేపీ సీట్లను, ఓట్లను అంచనాలకు అందని విధంగా పెంచి…మరిన్ని పార్టీలకు ఈ గడ్డమీద చోటుందన్న ఆశలు కల్పించారు. ఇక ఇప్పుడు మిగిలింది ప్రజల ఆలోచనలు సాగుతున్నంత పురోగమన రీతిలో పార్టీలు సాగుతాయా లేదా అన్నది తేలడమే.
అధికార పక్షంగా కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుంది…ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంత ప్రజాస్వామ్యయుతంగా నడుచుకుంటారు…ప్రతిపక్షంగా బీఆర్ ఎస్ ఎంత నిర్మాణాత్మంకంగా వ్యవహరిస్తుంది.
ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ ఏ స్థాయిలో ఎండగట్టగలుగుతుంది…అన్నది ఐదేళ్ల తర్వాత పార్టీల భవిష్యత్తునే కాదు..తెలంగాణ గమనాన్ని నిర్దేశిస్తాయి.