Rishi Sunak’s shocking decision: రిషి సునాక్ షాకింగ్ నిర్ణయం..ఇక ఆ వీసాలు రావడం కష్టమే!
ఇతర దేశాలకు వలసలు వెళ్లడంకొత్తేమి కాదు.స్వదేశంలో మేధోవలసలు జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. మేధావుల జ్ఞానానికి సరైన అవకాశాలు లేక సొంత దేశాన్ని వదిలిపెట్టి కుటుంబ సభ్యులకు దూరంగా వెళుతున్నారు..
దేశంలో వేగంగా పెరుగుతున్న వలసలను అడ్డుకునేందుకు ఉపాధి వీసాను మరింత కఠినతరం చేయాలని బ్రిటన్‌లోని రిషి సునాక్ సర్కారు నిర్ణయించింది.
ఇక నుంచి అత్యధిక వేతనాలున్న విదేశీ వృత్తి నిపుణులకే వీసాలివ్వాలని, డిపెండెంట్లుగా వచ్చే భాగస్వాములకు కఠిన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు బ్రిటన్ హోంశాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ హౌస్ ఆఫ్ కామన్స్‌లో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఆరోగ్య రంగంలో పని చేయడానికి వెళ్లిన వృత్తి నిపుణులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్ తీసుకురాలేరు. కఠిన నిబంధనల వల్ల ప్రస్తుత వలసల్లో 3లక్షల మంది వరకు తగ్గుతారని మంత్రి క్లెవర్లీ చెప్పారు.
బ్రిటన్‌లో వృత్తి నిపుణుల వీసా పొందడానికి గతంలో ఏడాదికి 26,200 పౌండ్ల వేతనం ఉంటే సరిపోయేది. కానీ, కొత్త నిబంధనల ప్రకారం ఆ వేతనం 38,700 పౌండ్లు ఉండాలని నిర్ణయించింది. గతంలో కుటుంబసభ్యుల వీసా కోసం 18,600 పౌండ్ల వేతనం ఉంటే సరిపోయేది.
కానీ, దానినీ 38,700 పౌండ్లకు ప్రభుత్వం పెంచింది. భవిష్యత్తులో విద్యార్థి వీసాలపైనా ఆంక్షలను అమలు చేయనున్నట్లు మంత్రి క్లెవర్లీ ప్రకటించారు. రికార్డ్ స్థాయిలో వలసలు వచ్చినట్లు బ్రిటన్ జాతీయ గణాంక కార్యాలయం నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
సుమారు 6,72,000 మంది బ్రిటన్‌కు వలసలు రాగా, వీరిలో అత్యధికులు భారతీయులే ఉన్నట్లు చెప్పింది. దానితో పాటు విదేశీ విద్యార్థులకు వీసాలను మరింత కఠినతరం చేసింది బ్రిటన్.
విదేశీ విద్యార్థితో పాటు వారి కుటుంబ సభ్యులనూ దేశంలోకి అనుమతిస్తున్న వీసా విధానానికి స్వస్తి పలికింది. కొత్త నిబంధనల ప్రకారం పరిశోధనేతర పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ కుటుంబసభ్యులను బ్రిటన్‌కు తీసుకెళ్లడానికి వీల్లేదు.
ఇక నుంచి కేవలం పరిశోధన విభాగానికి చెందిన పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసిస్తున్న విదార్థులు మాత్రమే తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇక, విదేశీ విద్యార్థి చదువు పూర్తికాకముందు ఉద్యోగం చేయడానికి కూడా ఇక నుంచి వీలుండదు.