
Modi – Rishi Sunak: మోదీ – సునక్ మధ్య చర్చలు – భారత క్రికెట్ జట్టుపై సునక్ ప్రశంశల జల్లు
భారత ప్రధాని నరేంద్ర మోదీ, యుకె ప్రధాని ప్రధాని రిషి సునక్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. వీరిరువురి మధ్య కొన్ని ఆశక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. అందులో క్రికెట్ కూడా ఒక అంశం కావడం విశేషం.
ఇరు దేశాధినేతలు క్రికెట్ గురించి మాట్లాడుకోవడం, అందులోను యూకే ప్రధాని మన ఆటగాళ్ల ఆట తీరును ప్రశంసించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
ఇక రిషి సునక్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో తమ జట్టు మంచి ఆటతీరును ప్రదర్శిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత వన్ డే వరల్డ్ కప్ లో భారత జట్టు దూసుకెళుతోంది.
ఓటమి అన్నది లేకుండా పాయింట్ల పట్టికలో ప్రధమ స్థానంలో నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే ప్రధాని మోదీ, రిషి సునక్ – భారత్, యూకేల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.
భారత్, యూకే దేశాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక ఒప్పందాలు, ఇరుపక్షాలకు కూడా మేలు చేకూర్చే విధంగా ఉండాలని, అటువంటి ఒప్పందాలకు ఇరువురు అంగీకరించినట్టు యూకే ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా తెలుస్తోంది.

భారత్, యూకేల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం 2022లో చర్చలు ప్రారంభమవగా, ఆయా చర్చలు ఇప్పటికి కొనసాగుతున్నాయి.
ఈ ఏడాది చర్చల్లో భాగంగా 12వ రౌండ్ చర్చలను ఆగస్టు 8 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించినట్టు తెలుస్తోంది.అంతే కాకుండా మోదీ సునక్ లు ఇజ్రాయిల్, హమాస్‌ల మధ్య జరుగుతోన్న యుద్ధంపై కూడా మాట్లాడుకున్నారు.
హమాస్ పాలస్తీనా ప్రజలకు ప్రతినిధి కాదని ఇరుదేశాధినేతలు గట్టిగానే చెప్పారు. గాజాలోని అమాయక పౌరులను రక్షించాలని, వారికి సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు.