Telugu woman molested in international flight : అంతర్జీతీయ విమానంలో తెలుగు మహిళకు వేధింపులు. అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు.
ఈ మధ్య కాలంలో విమానంలో ఆకతాయిల ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. తోటి ప్రయాణికుల పట్ల కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కొంత మంది దౌర్జన్యానికి దిగుతుంటే, మరి కొందరు అసభ్యంగా ప్రవర్తించడం, మూత్ర విసర్జన చేయడం వంటి ఘటనలు కూడా వెలుగు చూశాయి. మరికొంత మంది ప్రయాణికుల మీదనే కాక సిబ్బంది తో కూడా అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి ఘటనల పై డీజీసీఏ తీవ్ర స్పందన కనబరిచినప్పటికీ ఎక్కడ మార్పు కనిపించడం లేదు. అదే తరహా దురుసు ప్రవర్తనతో విసుగు తెప్పిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఒక అంతర్జాతీయ విమానంలో చోటుచేసుకుంది. కానీ ఈ సారి వేధింపులకు గురైంది మాత్రం మన తెలుగు మహిళ.
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్ నగరం నుంచి బెంగళూరుకు బయల్దేరిన విమానంలో మహిళ పక్కన కూర్చున్న వ్యక్తి ఆమెపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన సదరు మహిళ ఫ్రాంక్‌ఫర్ట్ నుండి బెంగుళూరు వెళ్లే విమానంలో ప్రయాణిస్తోంది. ఆమె పక్క సీటులో 52 ఏళ్ల ఓ వ్యక్తి ఉన్నాడు. వయసులో పెద్ద వాడే కదా, సభ్యత తెలిసిన వాడై ఉంటాడని భావించిన మహిళా అతని పక్కన కూర్చునేందుకు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. సీటు మార్పిడి కోరకుండా, తనకు కేటాయించిన సీటులోనే కూర్చుంది.
అయితే విమానం లో ఆమె నిద్రలోకి జారుకున్న అనంతరం అతగాడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. మెల్లగా ఆమె ప్రయివేటు భాగాలపై చేతులో వేయడం మొదలు పెట్టాడు. దీంతో వెంటనే మేలుకున్న సదరు మహిళ అతడిని ప్రతిఘటించింది. అయినప్పటికీ తన బుధ్హి మార్చుకోకుండా మరికొంత సేపటితరువాత అదే పనిగా ఆమెపై చేతులు వేయడం చేశాడు. దీంతో విసుగు చెందిన మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసి, తన సీటును మార్పించుకుంది.
ఎట్టకేలకు విమానం బెంగుళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. వెంటనే ఆమె అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానంలో తాను నిద్ర పోతున్నప్పటి నుండి జరిగిన ప్రతి విషయాన్నీ పూసగుచ్చినట్టు వివరించింది. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 ఎ కింద కేసు నమోదు చేసి అతగాడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా విచారణ అనంతరం కోర్ట్ అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయం తెలిసినవారందరు సదరు వ్యక్తిపై మండి పడుతున్నారు. ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.