Lok Sabha: పార్లమెంట్ లో కలకలం అసలేం జరిగింది.
ఈ నెల 13న పార్లమెంట్లో జరిగిన ఘటనలో ప్రధాన సూత్రదారుడు డి.మనోరంజనేనని దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా లభించినట్లు తెలిపారు.
ఏదైనా ఒక సంచలనాత్మక ఘటన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సందేశం పంపించాలనే ఉద్దేశంతోనే లోక్‌సభలో అలజడికి నిందితులు ఈ కుట్ర పన్ని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఈ కుట్రను అమలుచేయడానికి నిందితులను ఒప్పించడంలోనూ మనోరంజన్ కీలకంగా పాత్ర పోచించాడని తెలుస్తోంది. పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు నిందితుల్లో ఒకడైన లలిత్ ఝా దర్యాప్తులో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
పార్లమెంట్ ఘటన తరవాత ఆధారాలను చెరిపివేసే బాధ్యతను మాత్రమే తనకు అప్పగించారని లలిత్ విచారణ సమయంలో పేర్కొన్నాడని తెలుస్తోంది.పార్లమెంటులోపల దాడికి ప్రయత్నించిన సాగర్ శర్మతో పాటు, మనోరంజన్ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు.
ఇక సంవత్సరం క్రితం తాము మైసూరు వెళ్లేందుకు టికెట్లను సమకూర్చింది కూడా మనోరంజనేనని విచారణలో లలిత్ ఝా తెలిపాడు.
నిందితులందరికి మానసిక విశ్లేషణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నిరుద్యోగ సమస్య, రైతుల ఉద్యమం, మణిపుర్ సంక్షోభం వంటివి తమను తీవ్ర నిరాశకు గురిచేశాయని నిందితులు చెప్పినట్లు తెలిపారు. అయితే,
పార్లమెంటుపై దాడి ఘటనకు సంబంధించి సహేతుకమైన కారణాలను ఇంకా తెలుసుకోవాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. లలిత్ ఝాను కోర్టులో కూడా హాజరుపరిచారు.
ఆ తరువాత కోర్టు లలిత్‌ను 14 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. నిందితులకు ఆశ్రయమిచ్చిన విశాల్ కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
లోక్‌సభలో సంఘటన కు పాల్పడిన నిందితులకు సబంధించిన ఎఫ్‌ఐఆర్ ప్రతిని అందజేయాలంటూ దిల్లీ పోలీసులకు ట్రయల్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను దిల్లీ హైకోర్టు నిలిపివేసింది.
దిగువ కోర్టు ఉత్తర్వులను పోలీసులు దిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంతశర్మ ధర్మాసనం విచారణ జరిపింది. నిందితురాలు నీలం దేవికి నోటీసు జారీ చేయడం సహా ట్రయల్ కోర్టు ఆదేశాలపై స్టే విధించింది.
తదుపరి విచారణ జనవరి 4వ తేదీకి వాయిదా పడింది. అయితే, అత్యంత సున్నితమైన ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ ప్రతి కోసం నిందితులు పోలీస్ కమిషనర్‌ను సంప్రదించాల్సిందని,
కానీ, నేరుగా ట్రయల్ కోర్టును ఆశ్రయించారని పోలీసులు వాదించారు. ప్రధాన నిందితులు మనోరంజన్, సాగర్‌శర్మ, అమోల్ ధన్‌రాజ్ శిందే, నీలం దేవిలకు విధించిన కస్టడీని ట్రయల్ కోర్టు జనవరి 5వ తేదీ వరకు పొడిగించింది.