PM Modi inaugurate Ayodhya railway station: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లన్నీ వేగంగా చేస్తున్నారు అధికారులు. జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభిస్తారు.
మూడు రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్బంగా ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో ప్రధాని మోడీ నేడు అయోధ్యలో పర్యటించనున్నారు.
దీనిలో భాగంగా అయోధ్య లో రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. దీంతో పాటు 15,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను కూడా చేయనున్నారు.
ఈ రోజు ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ప్రధాని మోడీ అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అమృత్ భారత్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపుతారు.
రామాయణం థీమ్‌తో ఈ స్టేషన్ రూపుదిద్దుకుంది. అందులోని ప్రధాన ఘట్టాలను అయోధ్య స్టేషన్ గోడలపై చిత్రీకరించిన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ స్టేషన్‌కు అయోధ్య ధామ్ అని పేరు పెట్టింది రైల్వే మంత్రిత్వ శాఖ. రామమందిరం ప్రారంభం తరువాత.. అయోధ్యకు భక్తులు,
సందర్శకుల తాకిడి భారీగా పెరిగే అవకాశం ఉన్నందున ఈ స్టేషన్‌ను ఆధునికీకరించినట్టు తెలిపారు. దీనికోసం రైల్వేశాఖ 240 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.
ఇక ఈ రైల్వేస్టేషన్‌లోనే ఆరు వందే భారత్ రైళ్ల కు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు మోడీ. శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా- న్యూఢిల్లీ, అమృత్‌సర్- ఢిల్లీ, కోయంబత్తూర్-బెంగళూరు కంటోన్మెంట్,
మంగళూరు-మడ్గావ్, జాల్నా-ముంబై, అయోధ్య- ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య ఆయా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
మధ్యాహ్నం ఒంటిగంటకు అయోధ్య విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. 6 వేల 500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఎయిర్ పోర్ట్ ఉంటుందని తెలిపారు.
అత్యంత ఆధునికంగా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యంతో దీని నిర్మాణాన్ని చేపట్టినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.