Varun Raj Health Condition : ఖమ్మం విద్యార్థి పరిస్థితి విషమం..ఇంకా కోమాలోనే ఉన్న వరుణ్
అమెరికాలో చదువుకుందామని వెళ్లి అనుకోని విధంగా మృత్యుఒడిలోకి జారుకున్న తెలుగు రాష్ట్రాల బిడ్డలు ఎందరో ఉన్నారు.
విదేశాలకు వెళ్లి పై చదువులు చదువు కుంటే మంచి భావిద్యత్తు ఉంటుందని కోటి ఆశలతో ఖండాంతరాలు దాటి వెళ్లి, కన్నవారిని విడిచిపెట్టి దూరంగా ఉంటూ చదువుకుంటున్న వారు అనేక మంది.
తమ బిడ్డలు బాగానే ఉన్నారని, బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడని తల్లిదండ్రులు భవిస్తూ ఉంటారు. కానీ విధి వక్రీకరించినప్పుడు జీవితం తలకిందులవుతుంది.
ఆలాంటి వార్తలు విన్నప్పుడు కాలికింద ఉన్న భూమి కంపించినట్టు అవుతుంది. అలాంటి ఘటనే ఖమ్మం జిల్లా విద్యార్థి పుచ్ఛా వరుణ్ రాజ్ విషయంలో చోటుచేసుకుంది.
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో చదువుకునేందుకు వెళ్ళాడు వరుణ్ రాజ్. అక్కడ ఎం ఎస్ చేస్తున్నారు వరుణ్. కానీ గత నెల 31 వ తేదీ అనుకోని సంఘటన అతడిని ఆసుపత్రి బెడ్ మీద జీవచ్చవంలా పడి ఉండేటట్టు చేసింది.
24 సంవత్సరాల వరుణ్ రాజ్ మాదిరిగానే ఆ రోజు కూడా జిమ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు.
అంతలోనే ఒక దుండగుడు యమ కింకరుడిలా ఎదురుపడి కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వరుణ్ రాజ్ లూథరన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. వరుణ్ ను లైఫ్‌సపోర్టుపై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతడు ఇంకా కోమాలోనే ఉన్నాడని పేర్కొన్నారు.
వరుణ్ కు తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడటంతో అతని ఎడమవైపు శరీరంలో పాక్షిక వైకల్యం కలిగే అవకాశం కూడా ఉందన్నారు. మొత్త మ్మీద వరుణ్ రాజ్ ఆరోగ్యం విషమంగానే ఉందన్నారు.
ఈ క్రూరమైన దాడిని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు.
దాడి అనంతరం నిందితుడిని అరెస్టు చేశామని, అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని చెప్పారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.