191 Building Construction: గ్రామాలు- 191 భవనాల నిర్మాణం- డ్రాగన్ డబుల్ గేమ్!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కవ వివాదాలను చైనా తన ఖాతాలలో జమ చేసుకుంటోంది.
పొరుగు దేశాల సరిహద్దులను అక్రమించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మరోసారి తన వక్రబుద్ధి బయటపెట్టింది. ఒకవైపు సరిహద్దు వివాదంపై భూటాన్‌తో అధికారికంగా చర్చలు జరుపుతూనే మరోవైపు భూటాన్ భూభాగంలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. తాజాగా భూటాన్‌లోని జకర్‌లుంగ్ వ్యాలీలో డ్రాగన్ అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది. ఈ మేరకు మాక్సర్ అనే సంస్థ శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది.ఇళ్లు, సైనిక్ బ్యారెక్ల నిర్మాణాలను చేపట్టింది.
అరుణాచల్ ప్రదేశ్‌కు 50 కిలోమీటర్ల దూరంలో భూటాన్ తూర్పు సరిహద్దు వెంబడి చిన్న చిన్న గ్రామాలను చైనా నిర్మిస్తున్నట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో నివాస భవనాలు, సైనిక్ బ్యారెక్‌లు, ఔట్‌పోస్టులను చైనా నిర్మిస్తున్నట్లు మాక్సర్ సంస్థ తెలిపింది. గత రెండేళ్లుగా ఆ ప్రాంతంలో చైనా తన ఉనికిని పెంచుకునేందుకు తీవ్రంగా యత్నిస్తుందని పేర్కొంది.
విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల్లో సరిహద్దు వెంబడి రెండు చోట్ల భవనాలను చైనా నిర్మిస్తున్నట్లు కనిపించినట్లు వెల్లడించింది. మొదటి ఎన్‌క్లేవ్‌లో దాదాపు 129 భవన నిర్మాణాలు కనిపించగా, కొద్ది దూరంలో ఉన్న రెండో ఎన్‌క్లేవ్‌లో మరో 62 భవనాలు కనిపించాయని తెలిపింది. భూటాన్ ప్రజలకు సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యం కలిగిన బేయుల్ ఖెంపాజోంగ్ ప్రాంతానికి అనుకుని ఉన్న జకర్‌లుంగ్ వ్యాలీలో చైనా అక్రమ నిర్మాణాలు చేపట్టడం కలవరపెడుతోంది.
భూటాన్ సమీపంలో 2020 నుంచే చైనా నిర్మాణ పనులు చేపట్టింది. తొలుత ఆ ప్రాంతాల్లో రాకపోకలకు వీలుగా రోడ్లు నిర్మించింది. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేసింది. క్రమంగా వాటిని నివాస ప్రాంతాలుగా అభివృద్ధిపరిచింది. పలు వసతులతో గ్రామాలుగా తీర్చిదిద్ది అక్కడ ప్రజలు నివాసం ఉండేలా ప్రోత్సహిస్తోంది. భారత్, చైనా సైనికుల మధ్య 2017లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న డోక్లామ్ సరిహద్దులోని భూటాన్ భూభాగంలో కట్టడాలను చైనా చురుగ్గా కొనసాగిస్తూ అధిక సంఖ్యలో ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.దాదాపుగా చైనా సరిహద్దులలో ఉన్న దేశాలతో వివాదాలు ఉన్నాయి. అన్నీ దేశాలతో గొడవలకు దిగి అక్రమంగా వేరే దేశ భూభాగలను ఆక్రమించడంలో ముందు ఉంటుంది.