Congress Assembly Elections2023: కాంగ్రెస్ దెబ్బకి వార్ వన్ సైడ్.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు, మూడోసారి కూడా విజేతగా దుందుభి మ్రోగించి హ్యాట్రిక్ సీఎం అవ్వాలన్న కేసీఆర్ కలలు ఆవిరయ్యాయి.
కారు స్పీడ్ కి హ్యాండ్ బ్రేక్ బ్రేకులు వేసి అధికారాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మాజిక్ ఫిగర్ ను దాటి మెజారిటీ లోకి కాంగ్రెస్ అడుగుపెట్టడంతో ఆపార్టీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. హైదరాబాద్ లోని గాంధీ భవన్ తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కూడా సంబరాలు అంబరాన్నంటాయి.
కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాదాపు పదేళ్ల తరవాత తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
తెలంగాణ లో పోలింగ్ జరిగిన నాడు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ చూసినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ధీమాను వ్యక్తపరిచింది. సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది.
నేడు అదే నిజమైంది. తీన్ మార్ డప్పు చప్పుళ్ళు, టపాసుల మోతతో తెలంగాణ దద్దరిల్లుతోంది. మరో వైపు ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లలో అపజయాన్ని మూటగట్టు కున్న కాంగ్రెస్ కి తెలంగాణ విజయం కాస్త ఊటరనిచ్చింది అని చెప్పాలి.
తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లో బీజేపీ వీర విహారం చేసింది. మొత్తానికి తెలంగాణ లో హాంగ్ ఏర్పడుతుందని మొదట భావించినా, అదనుకు అవకాశం లేకుండా కాంగ్రెస్ వార్ వన్ సైడ్ చేసేసింది.