
KCR & Jagan : దివంగత నటుడు చంద్రమోహన్ కు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల సంతాపం..
విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో చంద్రమోహన్ కోట్లాది మంది అభిమానులను పొందగలిగారని అన్నారు తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు. దశాబ్దాలపాటు సాగిన ఆయన నట ప్రస్థానం ఎంతో గొప్పదని అన్నారు.
ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. తనదైన నటనతో హావభావాలతో తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా అభిమానులను అయన కలిగి ఉన్నారని చెప్పారు.
ఇక చంద్ర మోహన్ ఇండస్ట్రీలో ఎదిగిన తీరు చూసి అనేక మంది స్ఫూర్తి పొందారని అన్నారు. ఆయన లానే ఇండస్ట్రీకి వచ్చి మంచి స్థాయిలో స్థిరపడ్డారని అన్నారు. ఆయన మరణం వల్ల బాధాతప్త హృదయాలతో ఉన్న వారి కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్ర మోహన్ శివైక్యం కావడంపై స్పందించారు. చంద్రమోహన్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో కన్ను మూయడం బాధాకరమన్నారు.
వెండి తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చంద్రమోహన్ చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు.
అయన భౌతికంగా దూరమైనప్పటికీ అయన సినిమాలతో అభిమానుల మధ్యే ఉంటారని అన్నారు. ఏపీ సీఎం జగన్, నటుడు చంద్ర మోహన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
మరోవైపు చంద్ర మోహన్ అంత్యక్రియలు నేడు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అయన భౌతిక కాయాన్ని పలువురు నటీనటులు సందర్శించి తమ నివాళి అర్పిస్తున్నారు.
చంద్రమోహన్ తో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.