KCR nominated in Kamareddy and Gajvel. ఏకాదశి రోజున తెలంగాణాలో నామినేషన్ల హడావుడి. కామారెడ్డి, గజ్వేల్ లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్.
ఏకాదశి వచ్చిందంటే ఆలయాలకు భక్తులు క్యూ కడతారు. ఏకాదశి ఘడియల్లో దైవ దర్శనం చేసుకుంటే పాపలు నశించి సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. కానీ ఈ ఏకాదశి రోజున తెలంగాణ రాష్ట్రంలో మరో రకమైన హడావుడి కనిపించింది.
ఎన్నికల బరిలోకి దూకాలని సిద్ధంగా ఉన్న నేతలు ఈ మహోత్తరమైన రోజును చక్కగా ఉపయోగించుకున్నారు. సీనియర్ రాజకీయ నేతలు గెలుపు కాంక్షిస్తూ ఏకాదశి రోజునే తమ తమ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల హడావుడి కనిపించింది. నేతల ర్యాలీలుగా వెళ్లి నామినేషన్ పాత్రలను రిటర్నింగ్ ఆఫీసులో సమర్పించారు.
ముఖ్యంగా చూస్తే బి.ఆర్.ఎస్ అధినేత తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్, బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీష్ రావులు తమ తమ నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం తో పటు, కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండగా ఆ రెండు చోట్ల నామినేషన్ దాఖలు చేశారు.
సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, తమ తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇక బి.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నేత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్ నుండి ఎన్నికల బరిలోకి దిగుతుండగా అయన జి.హెచ్.ఎం.సి కార్యాలయం లో నామినేషన్ దాఖలు చేశారు.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో కత్తిపోటుకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాకలో నామినేషన్ వేశారు. వీల్ చైర్ పై వెళ్లి నామినేషన్ వేసిన ఆయన విజయంతో తిరిగి వస్తారని అయన అభిమానులు ఆశిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుండి కూడా కొంతమంది నేతలు ఏకాదశి రోజును బాగానే ఉపయోగించుకున్నట్టు అర్ధం అవుతోంది. సీనియర్ రాజకీయ నాయకుడు భట్టి విక్రమార్క మధిరలో నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు అయన ఏకాదశిని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా వైరా లోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ వేసిన వివేక్ వెంకట స్వామి కూడా ఏకాదశినే నమ్ముకున్నారు.
చెన్నూరులో నామినేషన్ వేసిన అయన అంతకు ముందే పారేపల్లి కాల భైరవస్వామి ఆలయంలో పూజలు చేశారు. కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి, హుజూర్నగర్ రిటర్నింగ్ ఆఫీస్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిరిసిల్ల అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి, నామినేషన్ల పాత్రలను సమర్పించారు.
ఇవన్నీ చూస్తుంటే రాజకీయ నేతలు రాను రాను సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతున్నారు అని ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. కానీ కొందరి వాదన మరోలా ఉంది. ప్రజాసేవ చేయడం అనేది మంచి పనే కాబట్టి, మంచి పని చేసేందుకు మంచి మూర్తం చూసుకుని వెళ్లడంలో తప్పేమి లేదని సమర్థిస్తున్నారు.