6tvnews

Header - Ramky
collapse
...
Home / లైఫ్ స్టైల్ / పర్యాటకం / సరిహద్దు గ్రామం ఎలా ఉంటుందంటే....

సరిహద్దు గ్రామం ఎలా ఉంటుందంటే....

2021-11-12  Lifestyle Desk
venus

kaho
Picture Courtesy : Twitter/Adarsh Kumar Choudhary

చైనాతో సరిహద్దు అనగానే గుర్తుకొచ్చేది అరుణాచల్ ప్రదేశ్. యావత్ అరుణాచల్ ప్రదేశ్ తనదేనని చైనా వాదిస్తుంటుంది. అంతే కాదు...తరచూ సరిహద్దు ఘర్షణలకు పాల్పడుతుంది. ఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేస్తుంటుంది. అలాంటి చోట ఓ సరిహద్దు గ్రామం ఎలా ఉంటుందో చూద్దాం.  


కాహో...  

అరుణాచల్ ప్రదేశ్ లో అంజా జిల్లాకు చెందిన సరిహద్దు గ్రామం. అక్కడికి కూతవేటు దూరంలోనే చైనా. లోహిత్ నదికి ఎడమవైపున ఈ గ్రామం ఉంటుంది. కాహో అంటే....‘ఎంతోమంది పూజారుల నివాస స్థలం’ అని అర్థం. ఆ గ్రామ జనాభా 78 మాత్రమే. అక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, పండ్లతోటలు, పశుపోషణ. గ్రామస్తులంతా బౌద్ధులే. చోర్ అనే ఒక పెద్దరకం ఆవు జాతి వారికి అవసరమైన పాలను సమకూరుస్తుంది. వ్యవసాయంలోనూ వారికి చేదోడుగా ఉంటుంది. ఓ ప్రాథమిక పాఠశాల, ఆరోగ్యకేంద్రం ఇక్కడ ఉన్నాయి. గ్రామంలో సైనికుల ఉనికి కూడా అధికంగా ఉంటుంది. సాధారణ ప్రజలు ఈ గ్రామం దాటి ఇక ముందుకు పోయేందుకు వీల్లేదు.  


ఏడాది పొడుగునా వేడుకలు  

ఇక్కడ నివసించే వారంతా మేయర్ తెగకు చెందిన వారు. వారి వస్త్రధారణ, సంస్కృతి అంతా కూడా మాన్పాలు, మెంబాలు, టిబెటిన్ల మాదిరిగానే ఉంటుంది. వీరికి పండుగలు కూడా ఎక్కువే. ఏడాది పొడుగునా వేడుకలు జరుగు తూనే ఉంటాయి. లాంచుత్ అనేది వారికి బాగా పెద్ద పండుగ. జనవరిలో దాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. ఫిబ్రవరిలో నూతన సంవత్సరాది వేడుక చేసుకుంటారు. మేయర్  తెగ వారు మిజు మిష్మి అనే మరో తెగవారితో సన్నిహితంగా ఉంటారు. అంతేకాదు మిజు మిష్మి మాండలికాన్ని కూడా మాట్లాడుతారు. మేయర్ తెగ ఆతిథ్యానికి పెట్టింది పేరు. అంతే కాదు దేశభక్తి కూడా ఎక్కువే. అది వారి రక్తంలోనే ఉంటుంది. 1962లో చైనా ఆక్రమణల సందర్భంలో ఈ తెగ వారు భారత సైన్యానికి సహకరించారు. గతంలో వీరు కలపతోనే ఇళ్లను నిర్మించుకునే వారు. ఇప్పుడు మాత్రం ఇంటి పైకప్పులకు ఇతర పదార్థాలు వాడుతున్నారు.   

మేయర్ తెగవారు అటు చైనాలోనూ ఉన్నారు. గతంలో రెండు దేశాల్లోని సరిహద్దు గ్రామాల ప్రజలు అటూ ఇటూ వెళ్లి వస్తు క్రయవిక్రయాలు చేసుకునే వారు. 1962 యుద్ధం తరువాత సరిహద్దు వ్యాపారం నిలిపివేశారు.   


కష్టాలమయంగా జీవితం  

సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో జీవితం కష్టాలమయంగానే ఉంటుంది. ఎత్తయిన పర్వతాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య జీవనం కొనసాగుతూ ఉంటుంది. నిజానికి అక్కడ వ్యవసాయం చేయడం కూడా చాలా కష్టం. ఇప్పుడిప్పుడే పండ్ల తోటలు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కివీ అక్కడ చక్కగా పెరుగుతుంది. మరో వైపున పర్యాటకానికి కూడా పెద్ద పీట వేస్తున్నారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఇళ్లను నిర్మించారు. సరిహద్దుల్లో మొట్టమొదటి భారతీయ గ్రామంగా కాహో పేరొందింది. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్దులై ఎంతో మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. సమీపంలోని డోంగ్ లో వేడినీళ్ళ గుండం ఉంది. ఇక్కడ సూర్యోదయం చూడడం కోసం పర్యాటకులు వస్తుంటారు.   


పరవశింపజేసే ప్రకృతి  

కాహో గ్రామం వ్యూహాత్మకంగా ఎంతో కీలక స్థానంలో ఉంది. అందుకే ప్రభుత్వం సైతం ఇక్కడ రకరకాల పథకాలతో స్థానికులకు సాయం చేస్తుంటుంది. కాకపోతే కొన్ని సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వాలకు సైతం కష్టంగానే ఉంటుంది. ఆజాది కా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకొని నవంబర్ 7న స్థానికులు మరో సారి తమ సమస్యలను రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలెన్ని ఉన్నా....అక్కడి ప్రకృతి అందాలు మాత్రం వాటిని మర్చిపోయేలా చేస్తాయి. అందుకే ఈశాన్య పర్యాటకం అనగానే.....పర్యాటకులెంతో మంది చలో కాహో అని అంటుంటారు.   

    


2021-11-12  Lifestyle Desk

rajapush