6tvnews

Header - Ramky
collapse
...
Home / వినోదం / తెలుగు / చిన్న నిర్మాత‌ల‌కు హ్యాపీ... పెద్ద నిర్మాత‌ల‌కు బీపీ

చిన్న నిర్మాత‌ల‌కు హ్యాపీ... పెద్ద నిర్మాత‌ల‌కు బీపీ

2021-11-25  Entertainment Desk
venus

amb cinemas
 

సినిమా అంటేనే ఓ వ్యాపారం... ఎంతో క‌ష్ట‌ప‌డి ఎన్నోకోట్లు ఖ‌ర్చుపెట్టి సినిమాలు నిర్మిస్తారు. ఇక అవి విడుద‌ల ద‌శ‌కి వ‌చ్చేస‌రికి నిర్మాత‌లు నానా తంటాలు ప‌డుతుంటారు. థియేట‌ర్లు దొర‌క్క‌... టికెట్ రేట్ల పైనా ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతుంటారు. అందులోనూ క‌రోనా త‌రువాత సినిమా ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. పెద్ద హీరోల‌ సినిమాల‌యితే త‌ప్పించి ఎవ్వ‌రూ కూడా థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాల‌ను వీక్షించే పరిస్థితి లేదు. అటువంటిది చిన్న సినిమాల ప‌రిస్థితి దారుణం అని చెప్పాలి. ఇలాంటి స‌మయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  టిక్కెట్ రేట్లు తగ్గించినా, చాలా ప్రాంతాల్లో పెద్ద సినిమాలు విడుద‌లైన‌ప్పుడు మాత్రం...  టిక్కెట్లు రేటు పెంచి అమ్మారు. స్థానికంగా ఉన్న అధికారులు ఈ వ్యవహారానికి సహకరించగా.. ప్రభుత్వం కూడా కాస్త అటూ...ఇటుగా చూసీచూడనట్టు వ్యవహరించింది. ఈ విషయాన్ని ఓ సందర్భంలో స్వయంగా మంత్రి పేర్ని నాని కూడా ప్రస్తావించారు.  

సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం  

క‌రోనా రావ‌డంతో తీవ్రంగా న‌ష్టాల్లో కూరుకుపోయిన సినీ ప‌రిశ్ర‌మ‌ని ఓ కొలిక్కి తీసుకురావ‌చ్చే క్రమంలో త్వరలోనే టిక్కెట్ రేట్లు పెరుగుతాయని టాలీవుడ్ జనాలు భావించారు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, రేపోమాపో టిక్కెట్ రేట్ల పెంపుపై నిర్ణయం వచ్చేస్తుందని, బెనిఫిట్ షోలపై కూడా సానుకూల ప్రకటన వస్తుందంటూ ప్రచారం జరిగింది. ఈ మొత్తం ప్రచారానికి జ‌గ‌న్ స‌ర్కార్‌ ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఏపీ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.  

తాజా సవరణ బిల్లు ప్రకారం, ఇకపై రాష్ట్రంలో అదనపు షోలు ఉండవ‌ని.. మూవీ విడుద‌లైన‌ మొదటి వారం అదనపు టికెట్ రేట్లు ఉండ‌వ‌ని.. ఇలా బెనిఫిట్ షో వ్యవహారానికి బ్రేకులేసింది. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో, నిర్దేశించిన టికెట్ రేట్లకి మాత్ర‌మే సినిమాలు ప్రదర్శించాలని మంత్రి పేర్ని నాని స్పష్టంగా ప్రకటన చేశారు. ఈ మేరకు ఆన్ లైన్ వ్యవస్థను తీసుకొచ్చారు.  

"తెల్లవారకముందే షోలు వేస్తూ బెనిఫిట్ షో పేరు చెప్పి జ‌నాల వ‌ద్ద ఇష్ట‌వ‌చ్చిన‌ట్టు డ‌బ్బులు గుంజ‌డం లాంటివి ఇక పై ఉండ‌వు. 4 షోలకు మించి షోల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి వీలులేద‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ప్రేక్షకుల బలహీనతల్ని సొమ్ము చేసుకోకుండా, టిక్కెట్ రేట్లను కట్టడి చేయడానికి ప్రభుత్వం ముందు ఉన్న మార్గం ఒకటే. అదే ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ."  

ఇంట్లో కూర్చొని ఎలాగైతే బస్సు, ట్రైన్ టిక్కెట్లు తీసుకుంటున్నారో.. సినిమా టిక్కెట్లు కూడా అలానే ఇంట్లో నుంచి బుక్ చేసుకునే పద్ధతి తీసుకొస్తామన్నారు మంత్రి."ప్రస్తుతం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన వసూళ్లకు, ప్రభుత్వానికి వచ్చిన పన్ను పోల్చి చూస్తే ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయిస్తే పారదర్శకత ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చే పన్నును ఎగ్గొట్టే ఆస్కారం ఉండదుని ఈ ప్రక్రియ‌ను ఏర్పాటు చేశారు.  

దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఆంధ్రాలో గతంలో చేసిన బిజినెస్ ను కాస్త తగ్గించుకున్నప్పటికీ.. బ్రేక్ ఈవెన్ అయి, లాభాల్లోకి రావాలంటే మొదటి వారం రోజులు టిక్కెట్ ధరలు పెంచాల్సిందే. దీనికి తోడు అదనపు షోలు కూడా వేయాల్సిందే. ఇన్నాళ్లూ ఆర్ఆర్ఆర్ మేకర్స్ దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. మ‌రి ఇలా ఉన్న‌ప్పుడు హై బ‌డ్జెట్ సినిమా ప‌రిస్థితి ఏంటి అని కొంత మంది నిర్మాత‌లు గుండెలుబాదుకుంటున్నారు.  

మరికొంతమంది హైకోర్టుకు వెళ్లి మొదటి వారం రోజులకు టికెట్ రేట్లు పెంచుకునేలా ఆర్డర్స్ తెచ్చుకున్న సందర్భాలున్నాయి. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో అలాంటివి కూడా జరగవు. ఎందుకంటే, ఏకంగా అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపి చట్టంగా తీసుకొస్తున్నారు. చట్టం అమల్లోకి వస్తే, అధికారులు కూడా లైన్లో పడతారు. చూసీచూడనట్టు వ్యవహరించే పరిస్థితి ఉండదు. అంచనాకు మించి బడ్జెట్ పెట్టిన నిర్మాత‌లు బాధపడుతున్నారు. ఇప్పుడు ఉరుములేని పిడుగలా ఈ చట్టం నిర్మాత‌ల మెడ‌కు చుట్టుకుంది.   

ఇకపై టాలీవుడ్ లో ఓ పెద్ద సినిమాకు ప్లాన్ చేసేముందు, ఏపీలో టిక్కెట్ రేట్లు దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఆన్ లైన్ వ్యవస్థతో ఎవరైనా కలెక్షన్ల చూసుకోవచ్చు. ఏపీలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న థియేటర్లోనైనా ఆక్యుపెన్సీ ఎంత ఉంది.. ఎంత కలెక్షన్ వచ్చింది.. ప్రభుత్వానికి టాక్స్ ఎంత వచ్చిందనే విషయాన్ని స్పష్టంగా చూడొచ్చు.  

సో.. ఏపీ థియేట్రికల్ బిజినెస్ కు సంబంధించి నిర్మాతలు, హీరోలు ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి ఉండదు. బిజినెస్ ఎంత జరిగింది, వసూళ్లు ఎంత అనేది ఉన్నదున్నట్టు మాట్లాడే పరిస్థితి వస్తుంది. దీంతో హీరోల మార్కెట్ కూడా డిసైడ్ అవుతుంది. కరోనా/లాక్ డౌన్ టైమ్ లో కూడా తమ పారితోషికాలు పెంచేసిన హీరోలు ఇప్ప‌టికైనా క‌నీసం దిగి వ‌స్తారేమో చూడాలి మ‌రి.    

ఇష్టారాజ్యంగా టికెట్ రేటు పెంచేయ‌డంతో చిన్న సినిమాకు ప్రేక్షకుడు రావడం మానేశాడు. కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ.. 200 రూపాయలు పెట్టి ఓ చిన్న సినిమా చూడడం అవసరమా అనే భావనకు వచ్చేశాడు. కొత్త చట్టం వల్ల టికెట్ రేట్లు అందుబాటులోకి వచ్చాయి. చిన్న సినిమాలకు కూడా ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి కల్పించింది ప్రభుత్వం. నిజంగా కంటెంట్ బాగుంటే, ఆ చిన్న సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారు.  


 


2021-11-25  Entertainment Desk

rajapush