‘కోల్ కతా లోని దుర్గాపూజ ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ లో చేర్చబడింది. కంగ్రాట్యులేషన్స్ ఇండియా’ అంటూ తాజాగా యునెస్కో చేసిన ట్వీట్ భారతీయ ప్రజానీకానికి ఆధ్యాత్మికతపరంగా సరికొత్త ఉత్తేజాన్ని అందించింది.
అయిగిరి నందిని నందిత మేదిని...విశ్వ వినోదిని నందనుతే
గిరివర వింధ్య శిరోధిని వాసిని...విష్ణు విలాసిని జిష్ణునుతే...
భగవతి హేశితి కంఠ కుటుంబిని...భూరి కుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసుర మర్దిని...రమ్యకపర్దిని శైలసుతే....
ఈ పాట వింటుంటూనే మనకు తెలియకుండానే శరీరంలో ప్రకంపనలు పుట్టుకొస్తుంటాయి. భక్తితో... భయంతో...దుర్గామాతకు దండం పెట్టుకుంటాం. ఉగ్రరూపంలో ఉన్నా భక్తులను కరుణిస్తుంది దుర్గామాత. ఆ తల్లికి చేసే పూజలకు ఇప్పుడు యునెస్కో గుర్తింపు కూడా లభించింది. కోల్ కతా చేసే దుర్గాపూజ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలకెక్కింది. యునెస్కోకు చెందిన ‘ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ గుర్తింపును పొందింది.
‘‘మతం, కళలకు సంబంధించి అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా దుర్గా పూజ కనిపిస్తోంది. కళాకారులు, డిజైనర్లు కలసి పని చేసే వేడుక ఇది. భారీ విగ్రహాలు, మండపాల ఏర్పాటుతో పాటుగా సంప్రదాయక బెంగాలీ డప్పుల మోత, దుర్గామాత అలంకరణ లాంటివన్నీ కూడా ఈ వేడుకకు ఒక విశిష్టతను సమకూర్చాయి. ఈ పూజ సందర్భంలో కులం, మతం, జాతి బేధాలన్నీ కుప్పకూలుతాయి. దుర్గామాత విగ్రహాలను దర్శించుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తారు’’ అని యునెస్కో వెబ్ సైట్ ప్రకటించింది.
యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం డిసెంబర్ 13 నుంచి పారిస్ లో వర్చువల్ గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోల్ కతాలో జరిగే దుర్గాపూజతో పాటుగా అరబిక్ కాలిగ్రఫీ, కాంగోకు చెందిన రుంబా కూడా తాజాగా మానవజాతి ఇంటాంజిబుల్ హెరిటేజ్ జాబితాలో చేరాయి.
కోల్ కతా లోని దుర్గాపూజ ఇప్పుడు అంతర్జాతీయ టూరిస్ట్ గైడ్ ల దృష్టిలో పడింది. దాంతో కోల్ కతా లో దుర్గా పూజ ఉత్సవాల సందర్భంగా విదేశీ పర్యాటకుల రాక కూడా అధికమయ్యే అవకాశం ఉంది. ఈ విధమైన గుర్తింపు బెంగాల్ పర్యాటక రంగానికి ఊతమివ్వగలదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రపంచ పర్యాటక పటంలో ఇప్పుడు దుర్గా పూజ కూడా ప్రముఖంగా చోటు చేసుకుంది.
దుర్గాపూజను ఈ జాబితాలో చేర్చే ప్రక్రియకు 2019లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నాంది పలికింది. ప్రముఖ ఆర్ట్ హిస్టారియన్ తపతి గుహ థాకుర్తా ను దుర్గాపూజ పై ఒక డాక్యుమెంట్ తయారు చేయాల్సిందిగా సంగీత నాటక అకాడమీ కోరింది.
నిజానికి కేంద్రప్రభుత్వం యావత్ భారతదేశంలో జరిగే దుర్గాపూజ వేడుకలను ఆధారంగా చేసుకొని డాక్యుమెంట్ రూపొందించాల్సిందిగా సూచించింది. అయితే, దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే...కోల్ కతా లోనే ఈ పండుగ సందడి అధికం. అందుకే దాన్ని ప్రధానకేంద్రంగా చేసుకొని డాక్యుమెంట్ రూపొందించినట్లుగా తపతి గుహ తెలిపారు.
దుర్గా పూజ మొదట్లో హిందువుల పూజా కార్యక్రమంగా మాత్రమే ఉన్నప్పటికీ, ఇప్పుడు అది మతం హద్దులను అధిగమించి ఒక జాతి యావత్తూ చేసుకునే గొప్ప వేడుకగా మారింది. ప్రజలకు ఉత్తేజమిచ్చే సందర్భంగా నిలిచింది.