Courtesy: twitter/ragiing_bu
గంధం.. కుంకుమతో అలంకరణ..
స్వాములు కనుబొమల మధ్య గంధం.. కుంకుమ ధరిస్తారు. యోగా శాస్త్రం ప్రకారం కనుబొమల మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. ఇక్కడ పరమాత్మ జ్ఞాన రూపంలో జ్యోతిలా ప్రకాశిస్తుంటాడు. ఈ ప్రదేశాన్ని గంధం, కుంకుమతో అలంకరించడం ద్వారా మనలోనే ఉన్న పరమాత్మను అర్చించే ఆధ్యాత్మిక భావనకు అయ్యప్ప దీక్ష బీజం వేస్తుంది. అంతేకాకుండా పాలభాగంగా పిలిచే ఈ ప్రాంతంలో ఇతరుల దృష్టి కేంద్రీకృతమవుతుంది. కుంకుమ, విభూది, గంధం, చందనాల్లో ఏదో ఒకటి పెట్టుకోవడం వల్ల ఇతరుల దృష్టి మనపై కేంద్రీకృతం కాదు.
నలుపే ఎందుకంటే?
అయ్యప్ప స్వాములు నల్లని దుస్తులు ధరించాలన్న నియమం ఉంది. భక్తులు ఈ దీక్షను చలికాలంలో చేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో ఎండ వేడిమిని వెంటనే గ్రహించి రక్షణ కల్పించడంలో నలుపు రంగు ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని వర్ణాల్నీ తనలో కలుపుకునే లక్షణం నలుపునకు మాత్రమే ఉంది. అంతిమంగా దీక్ష తీసుకున్న వ్యక్తి పరమాత్మలో లీనం కావడాన్ని నల్లని వస్ర్తధారణ ప్రతిబింబిస్తుంది. నలుపు తమో గుణానికి సంకేతం. దాన్ని అదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ప్రతి మనిషికీ ఉంది. ఈ కర్తవ్యాన్ని వస్త్రధారణ ప్రతిక్షణం గుర్తు చేస్తుంది.
‘అయ్యప్ప‘ అని పిలిచిన పలికే..
‘అయ్య‘, ‘అప్ప‘. ఈ రెండు పదాల కలయిన వల్ల ఏర్పడింది అయ్యప్ప అనే పదం. ఈ అయ్యప్ప పరమాత్మం స్వరూపం, శివ, కేశవ సంయోగరూపమైన అయ్యప్ప స్వామి యోగ, జ్ఞానమయ మంగళమూర్తిగా శబరిగిరి మీద భక్తులకు దర్శనమిస్తున్నారు. శివుడు, విష్ణువు, లలిత అనే రూపాలన్నీ మన భావనలే కానీ పరమాత్మ స్వరూపం ఒక్కటేనని వేదాంతం చెబుతోంది. ‘పుం రూపా విష్ణువిగ్రహా‘ అని లలితోపాఖ్యానం చెప్పినట్లు మోహినీరూపంలో ఉన్న విష్ణువు సాక్షాత్తు శక్తి(లలిత) స్వరూపం. ఒకే పరతత్వం సాధకుల సౌలభ్యం కోసం వివిధ రూపాల్లో ప్రకటితమవుతుందని మహర్షుల వచనం.
వాజివాహనం స్వామి శరణమయ్యప్ప
శబరిమల ఆలయ ధ్వజస్తంభం ముందు గుర్రం విగ్రహం ఉంటుంది. అది చంచల స్వభావానికి, కోరికలకు ప్రతీక, దుందుడుకుగా ఉండే గుర్రాన్ని ఎలాగైతే రౌతు అదుపులో ఉంచుతాడో, కోరికలకు సాధకుడు భక్తి అనే కళ్లెం వేసి నియంత్రించాలనేది సందేశం. ఆలయంలో నిత్యం రాత్రివేళ వినిపించే ‘హరివరాసనంలో‘ స్వామిని ‘వాజివాహనం‘, ‘తురగవాహనం‘ అని సంబోధించడంలో ఉన్న అంతరార్థం కూడా అదే.
స్వామియే శరణం అయ్యప్ప.. శరణుఘోష
అయ్యప్ప పూజలో ప్రధానాంశం ‘శరణు ఘోష‘. దాన్ని వింటుంటేనే అలౌకికనందాన్ని మనం పొందగలం. అనేక విధాలైన స్తోత్రాలు, నామాలతో అయ్యప్పను స్వాములు ఆరాధాస్తారు. మనకుండే యవ్వనం, అందం, అనుభవించే భోగభాగ్యాలు ఇవేవి శాశ్వతం కావు. స్వామి పాదాలను శరణు వేడడమే ముక్తికి మార్గం. భవబంధాలను విడిచి స్వామి చరణాలను పట్టుకునేందుకు మనిషి మనస్సును సన్నద్ధం చేసే ఆధ్యాత్మిక సాధన శరణుఘోష ప్రధానాశయం.
ఇరుముడి కట్టు.. శబరిమలెక్కు..
ఇరుముడి అంటే రెండు ముడులు లేదా ముడుపులని అర్థం. శబరిమల యాత్రకు బయల్దేరే ముందు రెండు భాగాలుగా ఉన్న ఇరుముడిని స్వాములు ధరిస్తారు. ఈ రెండు ముడులూ భక్తి, శ్రద్ధలకు ప్రతీకలు. ఇరుముడిని బంధించే తాడు ప్రణవానికి ప్రతీక. భక్తి, శ్రద్ధలను ప్రణవంతో బంధిస్తే(సాధన చేస్తే) పరమాత్మను చేరుకోవటం సాధ్యమవుతుందని చెప్పటమే ఇరుముడి అంతరార్థం.
అగ్నిలో కొబ్బిరికాయలు వేయడం..
శబరిమలకు చేరుకొని, స్వామిని దర్శించుకున్న తర్వాత ఇరుముడిలోిన కొబ్బరికాయను హోమగుండంలో సమర్పిస్తారు. యజ్ఞం అంటే సమర్పణ భావం. తనను తాను దైవానికి సమర్పించుకోవడం మనిషి చేసే సాధనలో తుది అంకం. ఆ తర్వాత వ్యక్తి పరిపూర్ణత్వాన్నిసంతరించుకుంటాడు. శాస్త్రాలు కూడా ‘యజ్ఞోహి శ్రేష్ఠతం కర్మ‘- మనిషి ఆచరించే కర్మలన్నింటిలో యజ్ఞలు ఉత్తమమైనవని చెబుతున్నాయి. ఉత్తమ క్రియల ద్వారా పూర్ణత్వాన్ని సాధించటమే కొబ్బరికాయను అగ్నికి సమర్పించటంలో భావం.
పదునెట్టాంబడి..
శబరిమల స్వామి దర్శనానికి ముందుగా స్వాములు 18మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. దీన్నె పదునెట్టాంబడి అంటారు. ఇది పరిపూర్ణత సాధించిన జ్ఞానానికి సంకేతం. ఈ మెట్లు ఎక్కి స్వామిని దర్శించడమంటే సాధనలో చివరి అంకాన్ని చేరుకున్నట్లు అవుతుంది. అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతిష్టితుడైన సందర్భంగా మృదంగ, భేరీ, కాహళ, దుందుభి, తుంబుర, మద్దెల, వీణ, వేణువు, నూపుర, మట్టుక, డిండిమ, ఢక్క, ధవళ, శంఖ, పరుహ, జజ్జరి, జంత్ర అనే 18వాయిద్యాలను మోగిస్తారు. 18మెట్లకు ఇవి ప్రతీకలు.
తత్త్వమసి మహావాక్యం...
40 రోజులు దీక్ష పూర్తి చేసుకొని శబరిమల స్వామి ఆలయాన్ని చేరుకొని, పదునెట్టాంబడి ఎక్కగానే ఆలయం ముందు భాగంలో ‘తత్త్వమసి‘ అనే మహావాక్యం కనిపిస్తుంది. సామవేద మహావాక్యము ‘తత్త్వమసి‘. చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, నీలోనే ఉండి, నీవైయున్నదని నిర్వచించడం చాలా ఆశ్యర్యాన్ని, తృప్తిని కలిగిస్తుంది. శంకర భగవత్పాదులు చాటి చెప్పిన అద్వైతము ఈ మహావాక్యము నుండే ఆవిర్భవించినది. ఇది వేదసారం, ఉపనిషద్బోధ. తత్, త్వం, అసి అనే మూడు పదాల కలయిక తత్త్వమసి. ‘అది నీవై ఉన్నావు‘ అనేది ఈ వాక్యానికి అర్థం.