6tvnews

collapse
...
Home / ఆరోగ్యం / పిల్లల ఆరోగ్యం / ఆ దగ్గు మందు వాడితే పిల్లలు చనిపోతారా?

ఆ దగ్గు మందు వాడితే పిల్లలు చనిపోతారా?

2021-12-21  Health Desk

small kids (2) (1)
 

చిన్నారులు దగ్గు, జలుబు బారిన పడితే ఏం చేస్తాం. వైద్యులను ఆశ్రయిస్తాం. వాళ్లు సర్వసాధారణంగా పిల్లలకు అందుబాటులో ఉన్న దగ్గు మందుల్లో ఒకదానిని వాడాలని సూచిస్తారు. కానీ ఢిల్లీ మొహల్లా క్లినిక్ ల వైద్యులు సూచించిన దగ్గుమందు వాడిన ముగ్గురు చిన్నారులు ఆరోగ్యవంతులు కావడమేమో కానీ.. అనారోగ్యం పాలు కావడమే కాకుండా తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చారు. ఈ ఏడాది జూన్ 29 నుంచి నవంబర్ 21 వరకు మొహల్లా వైద్యులు సూచించిన సిరప్ వాడడంతో ముగ్గరు చిన్నారులు మరణించారు. మరో 13మంది తీవ్ర అనారోగ్యం పాలుకావడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కళావతి సరన్ పిల్లల వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనలపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో వెంటనే స్పందించిన కేజ్రీవాల్ నాయకత్వంలోని ప్రభుత్వం కారణమైన వైద్యులను విధుల నుంచి బర్తరఫ్ చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తామని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు. వైద్యుల నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ రాజీనామా చేయాలని విపక్ష బిజెపి, కాంగ్రెస్ డిమాండ్ చేశాయి.    

అసలు ఏం జరిగింది... ఆ మందు ఏంటీ?   

దగ్గుతో పాటు వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న పిల్లలను తల్లిదండ్రులు ఢిల్లీ  ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మొహల్లా క్లినిక్ లకు తీసుకుని వచ్చారు. వారిని పరీక్షించిన వైద్యులు ‘డెక్స్టోమెథోర్ఫాన్’ సిరప్ ను వాడాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. ఇంటికెళ్లిన తర్వాత ఆ సిరప్ ను వాడడంతో పిల్లలు మరింత అనారోగ్యం పాలయ్యారు. దీంతో వారిని తీసుకుని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కళావతి సరన్ పిల్లల వైద్యశాలకు తల్లిదండ్రులు పరుగులు పెట్టారు. వారిలో చికిత్స తీసుకుంటూ ముగ్గురు చనిపోగా, మరో 13మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వీరంతా 1-6 ఏళ్ల పిల్లలే. వారికి వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.     

ఘటనలపై నలుగురు సభ్యుల విచారణ కమిటీని ప్రభుత్వం నియమించింది. జిల్లా వైద్యాధికారి నాయకత్వంలో దర్యాప్తు జరిపి, ఏడు రోజుల్లో నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు కళావతి సరన్ ఆస్పత్రి పాలక వర్గం జులై 1న కేంద్ర ఆరోగ్యశాఖకు పరిస్థితిని నివేదించింది. చొరవ తీసుకున్న కేంద్ర ఆరోగ్యశాఖ అక్టోబర్ చివరలో విచారణకు ఆదేశించింది. పిల్లలు అనారోగ్యం పాలుకావడానికి డెక్స్టోమెథార్ఫాన్ దగ్గు సిరప్ ను అధిక మోతాదులో వాడడమే కారణమని తేల్చింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా నలుగురు సభ్యుల నిపుణుల టీమ్ తో విచారణకు ఆదేశించింది. దీనికి ఆగ్నేయ ఢిల్లీకి చెందిన వైద్యాధికారిణి డాక్టర్ గీతను కమిటీ చీఫ్ గా నియమించింది. ఏడు రోజుల్లో నివేదిక అందజేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది.    

అధిక మోతాదులో వాడితే ఏమవుతుంది...   

డెక్స్టోమెథార్ఫాన్ దగ్గు మందును పిల్లల్లో అధిక మోతాదులో వాడితే నిద్రలేమికి దారి తీస్తుందని వైద్యులు తేల్చారు. కనుపాపలు పెద్దగా మారడంతో పాటు మైకం కమ్ముకుంటుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అంతేకాకుండా డయేరియాకు దారి తీస్తుందని తేల్చారు.    

కేంద్రం ఏం చెప్పంది...   

ఈ నెల డిసెంబర్ 7న కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన డైరెక్టరేట్ హెల్త్ జనరల్(డిజిహెచ్) డాక్టర్ సునీల్ కుమార్ ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు. నాలుగేళ్ల లోపు చిన్నారులకు డెక్స్టామెథార్ఫాన్ ఔషధాన్ని వాడకాన్ని సజెస్ట్ చేయకుండా డిస్పెన్సరీలు, మొహల్లా క్లినిక్ లకు ఆదేశించాలని అందులో సూచించారు. ప్రజల ప్రయోజనాన్ని ఆశించి ఒమెగా ఫార్మా తయారీ ఈ డ్రగ్ ను ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశించింది. మరోవైపు చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ.కోటి పరిహారాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం అందజేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరో 13మంది చిన్నారులకు 10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కోరింది.    


 


2021-12-21  Health Desk