Courtesy:Twitter/@Ritesh4Raj
తెలంగాణ అంటే గుర్తుకు వచ్చే అత్యంత ప్రముఖ వ్యక్తుల్లో పీవీ నరసింహారావు ఒకరు. తెలంగాణ నుంచి ప్రధాని పదవి చేపట్టిన ఏకైక వ్యక్తి ఆయనే. అంతే కాదు....భారతదేశం మొదటి అణుపరీక్ష పాక్షిక విజయంగానే భావించిన నేపథ్యంలో దేశాన్ని రెండో అణు పరీక్షకు సన్నద్ధం చేసిన ఘనత కూడా ఆయనదే. రెండో అణుబాంబు ను పరీక్షింప చేసిన ఘనత అటల్ బిహారి వాజ్ పేయికే దక్కినప్పటికీ....తెర వెనుక నిలిచిపోయిన వ్యక్తి మాత్రం పీవీ నరసింహారావు అంటే అతిశయోక్తి కాదు.
స్మైలింగ్ బుద్ధ పాక్షిక విజయమేనా....?
భారతదేశం 1974 మే 18న మొదటి అణుపరీక్ష నిర్వహించిది. స్మైలింగ్ బుద్ధ పేరిట ఈ ఆపరేషన్ నిర్వహించారు. అయితే అది పాక్షిక విజయమేననే వ్యాఖ్యలూ ఉన్నాయి. 1996 నాటి అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలు సైతం నాటి పరీక్షను వైఫల్యంగానే పేర్కొన్నాయి. అయితే అలా చెప్పేందుకు గల కారణాలను మాత్రం ఆ నివేదికలో పేర్కొనలేదు. బహుశా అతి తక్కువ పేలుడు సామర్థ్యం ఉండడం అందుకు కారణం కావచ్చు. ఆ నేపథ్యంలో భారత్ ను రెండో అణుబాంబు ప్రయోగం దిశగా నాటి ప్రధాని పీవీ నర్సింహారావును ఆనాటి శాస్త్రవేత్తలు ప్రేరేపించారు అని కూడా అమెరికా పత్రాలు వెల్లడించాయి.
అప్పట్లో పోఖ్రాన్ వద్ద జరిగిన మొదటి అణుపరీక్ష ఫలితంపై వాదోపవాదాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దాని వాస్తవ ఫలితం సుమారుగా 8-12 కిలోటన్నుల టీఎన్టీ మాత్రమే అనే వారూ ఉన్నారు. ది ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఎఎస్) కూడా తన వెబ్ సైట్ లో భారత్ తొలి అణు పరీక్షను పాక్షిక విజయంగానే అభివర్ణించింది.
ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు....
1996లో సాధారణ ఎన్నికలకు ఫలితాలకు రెండు రోజుల ముందు ఏం జరిగిందో తెలుసుకోవడం కూడా ఎంతో ఆసక్తిదాయక విశేషం. ఫలితాలు రావడానికి సరిగ్గా రెండు రోజుల ముందు....అణు పరీక్షకు సన్నద్ధంగా ఉండాల్సిందిగా రక్షణ శాఖ మంత్రి సైంటిఫిక్ అడ్వయిజర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ను ఆదేశించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ఉంటే...పీవీ నరసింహారావు ప్రధానిగా కొనసాగి ఉంటే....రెండో అణుపరీక్ష నిర్వహించిన పీవీకే దక్కి ఉండేది. కానీ ఆయన తలరాత మరోలా ఉండింది. తరువాతి కాలంలో...అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధాని అయ్యారు. అలా అణు పరీక్షకు మార్గాన్నిపీవీ నర్సింహారావు సుగమం చేశారు. 2013 జనవరి 24న న్యూదిల్లీలో క్యాబినెట్ సెక్రటరియేట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నిర్వహించిన ఆర్ ఎన్ కావ్ మెమోరియల్ లెక్చర్ సమావేశంలో ఏపీజే అబ్దుల్ కలామ్ స్వయంగా ఈ వివరాలు వెల్లడించడం విశేషం.
‘‘1996 మే నెల నాకింకా గుర్తుంది. అది 9 గంటల సమయం. నాకొక ఫోన్ కాల్ వచ్చింది. ప్రధాని పీవీ నర్సింహారావు గారిని వెంటనే కలుసుకోవాలని’’ అంటూ నాటి సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.
‘‘కలామ్, అణుశక్తి శాఖ, మీ బృందంతో కలసి అణుపరీక్షకు సిద్ధంగా ఉండండి. నేను తిరుపతికి వెళ్తున్నాను. టెస్ట్ చేయడానికి ముందు నా అనుమతి కోసం వేచి ఉండండి. డిఆర్ డిఒ – డిఎఒ బృందాలు సిద్ధంగా ఉండాలి’’ అని ఆనాడు పీవీ నర్సింహారావు, కలామ్ ను ఆదేశించారు.1998 మే నెలలో పోఖ్రాన్ -2 అణు పరీక్ష జరిగింది.
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా మాత్రమే కాదు...భారత్ ను అణు పరీక్షకు సిద్ధం చేసిన వ్యక్తిగా కూడా పీవీ నర్సింహారావు చరిత్రలో నిలిచిపోయారు. 2004 డిసెంబర్ 23న పీవీ నర్సింహారావు స్వర్గస్తులయ్యారు.