సైనికపాలనలో మగ్గుతున్న మయన్మార్‌ను భారత విదేశీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా సందర్శించారు. డిసెంబర్ 22 నుంచి రెండు రోజుల అధికారిక పర్యటన కోసం హర్షవర్దన్ మయన్మార్ లో ఉన్నారు. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన అంగ్ సాన్ సూకీని ఆమె పార్టీ నేతలను గత ఫిబ్రవరి నెలలో నిర్బంధించి సైనిక పాలన విధించిన తర్వాత భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మయన్మార్ సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్శనలో ఆయన ప్రభుత్వ పాలనా మండలితో, రాజకీయ పార్టీలతో, పౌర సమాజ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేస్తూ, మయన్మార్ పాలకమండలితోపాటు వివిధ వర్గాలతో కార్యదర్సి హర్ష వర్ధన్ చర్చలు జరుపుతారని పేర్కొంది. మయన్మార్‌కి మానవతా సహాయం అదించడం, భద్రత, ఇండియా-మయన్మార్ సరిహద్దు సమస్యలు, ఆ దేశంలోని రాజకీయ పరిస్థితి వంటి అంశాలపై విదేశీ కార్యదర్సి చర్చిస్తారని తెలిపింది.
అధికారం నుంచి తొలగించబడిన మయన్మార్ నేత అంగ్ సాన్ సూకి, తదితరులపై డిసెంబర్ 7న కోర్టులో తీర్పు వెలువడి వారిపై శిక్షలు ఖరారై 2 వారాల తర్వాత భారత విదేశీ కార్యదర్శి మయన్మార్ సందర్శించడం విశేషం. మయన్మార్‌లో చట్టబద్దపాలనను, ప్రజాస్వామిక ప్రక్రియను ఎత్తిపట్లాల్సిందేనేని భారత విదేశాంగ శాఖ ప్రకటన నొక్కి చెప్పింది. ఈ ప్రక్రియను విస్మరించే, తగ్గించే ఏ పరిణామమైనా అందోళన కలిగిస్తుందని పేర్కొంది.
సైనికపాలన విధింపు అనంతరం దేశంలో అసమ్మతిని, తిరుగుబాటును ప్రేరేపించారన్న ఆరోపణ రుజువైందని పేర్కొంటూ మయన్మార్ కోర్టు అంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే ఆ తర్వాత ఆ శిక్షను న్యాయస్థానం రెండేళ్లకు తగ్గించింది.
చైనా ప్యాక్టర్
భారత్, అమెరికా సంబంధాలు బలోపేతమవుతున్న నేపథ్యంలో మయన్మార్ పరిస్థితి మనకు ఇరకాటంగా మారాయి. మయన్మార్‌లో చైనా రాజకీయపరంగా, సైనికపరంగా, ఆర్థిక పరంగా తన పాత్రను బలంగా ముద్రించుకున్న నేపథ్యంలో మయన్మార్‌లో నే పీ తా పాలనను ఒంటరిని చేయకూడదని భారత్ కోరుకుంటోంది. అక్కడి సైనిక నాయకత్వంతో తాను భాగస్వామ్య దేశాలు కలిసి చర్చించగలమని భారత్ భావిస్తోంది. విదేశీ కార్యదర్శి హర్ష వర్ధన్ మయన్మార్ సందర్శన్ దీంట్లో భాగమే కావచ్చు.
డిసెంబర్ 9,10 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రజాస్వామ్య సదస్సు నిర్వహించిన నేపథ్యంలో భారత్ విదేశీశాఖ ప్రకటన వెలువడింది. ప్రధాని నరేంద్రమోదీ ఈ సదస్సురు వర్చువల్‌గా హాజరయ్యారు కూడా.
గతంలో తాను చేసిన ప్రకటనకు భిన్నంగా భారత్ విదేశీ శాఖ మయన్మార్ వ్యవహారాలపై చేసిన ప్రకటన చాలా స్పష్టంగా ఉండటం గమనార్హం. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న సైనిక కుట్ర జరిగాక మయన్మార్‌లో కనీవినీ ఎరుగని నిరసన ప్రదర్శనలు పోటెత్తాయి. ఈ నిరసనలపై సైన్యం ఉక్కుపాదం మోపడంతో పిల్లలతో సహా వందలాదిమంది మరణించారు. నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ అధినేత సూకీతో పాటు ఆమె పార్టీకి చెందిన వందలాదిమంది నేతలను సైన్యం నిర్బధంలోకి తీసుకుంది. ఈ కుట్ర జరిగిన కొన్ని గంటల్లోపే భారత విదేశా శాఖ స్పందిస్తూ ఆ దేశంలో జరిగిన పరిణామాలు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది.
మయన్మార్‌పై చైనా ప్రాబల్యం పెరుగుతుండటం భారత్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అందుకే మయన్మార్ సైనిక కుట్రపై భారత ప్రభుత్వం నేరుగా విమర్శించింది. భారత్, మయన్మార్ సరిహద్దుల్లో శాంతి స్థాపన, భద్రత కీలకం కాబట్టి భారత్ మయన్మార్ వ్యవహారాలను తేలికగా తీసుకోవడం లేదు.
సైనిక కుట్ర తర్వాత మయన్మార్ సైనిక పాలనను గత జూన్ నెలలోనే భారత ప్రత్యర్థి చైనా గుర్తిస్తూ ప్రకటన చేసింది. ప్రస్తుతం భారత విదేశీ కార్యదర్శి సందర్శన నేపథ్యంలో అక్కడి సైనిక పాలనను మన దేశం కూడా లాంఛనంగా గుర్తించినట్లేనని భావిస్తున్నారు.
అంగ్ సాన్ సూకీ నేతృత్వంలో ఏర్పడిన సమాంతర జాతీయ ఐక్యతా ప్రభుత్వ సభ్యులు చాలావరకు నిర్బంధంలో ఉండటం లేక రహస్యంగా ఉంటూ మయన్మార్ సైనికపాలనపై యుద్దం ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలనా మండలితో పాటు పౌర సమాజంతో కూడా విస్తృత స్థాయి చర్చలు జరుపుతామని భారత విదేశీ శాఖ ప్రకటించడం కంటితుడుపు చర్యగానే భావించవచ్చని విశ్లేషకుల భావన.
అయితే కొంతకాలంపాటు మయన్మార్‌తో అధికారికంగా సంబంధాలను కొనసాగించటానికి భారత్ ప్రయత్నించే అవకాశాలను కొట్టిపారేయలేము. సైనిక కుట్రపై తీవ్ర ఆందోళన, ప్రజాస్వామ్య పునరుద్ధరణపై ప్రకటనలు చేస్తూనే భారత్ తన అవకాశాల పట్ల స్పష్టతతో ఉంది. మయన్మార్‌లో తిరుగుబాటు తీవ్రంగా ఉన్న సమయంలోనే ఆ దేశ సాయుధ దళాల దినోత్సవంలో భారతీయ అధికారులు పాల్గొన్నారు. అలాగే గత జూన్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సైనిక కుట్రను ఖండిస్తూ చేసిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా జరిగింది. తర్వాత ఈ నవంబర్‌లో మయన్మార్‌లో భారత రాయబారిని నూతనంగా నియమించింది. ఇది దౌత్య సంబంధాల కొనసాగింపుకు మరో సంకేతమేనని చెబుతున్నారు.