6tvnews

collapse
...
Home / తెలంగాణ / చంపేసే హక్కు ఎవరిచ్చారు ?

చంపేసే హక్కు ఎవరిచ్చారు ?

2022-01-12  News Desk

suicide-2
 

బొమ్మను చేసి.. ప్రాణం పోసి.. కన్నవాళ్లే కాలరాసి.. 

పసి జీవితాలను బలి చేస్తున్న తల్లిదండ్రులు.. 

తమతో పాటు పిల్లలకు మరణ శాసనం.. ఇదెక్కడి న్యాయం..

వైవాహిక జీవితానికి అందమైన తీపి గుర్తు పిల్లలు.. పిల్లలంటే భవితవ్యం వైపు బంగారు బాటలు వేసుకుని గుబాళించే మల్లెలు.. కానీ ప్రపంచం ఏమిటో అర్థం కాక ముందే వారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.. బాధ్యత మరిచి భావితరాల జీవితాలకు ఆదిలోనే ముగింపు పలుకుతున్నారు.. అత్యంత హేయమైన ఈ చర్యలకు పాల్పడుతున్నది ఎవరో కాదు సాక్షాత్తు ఆ పిల్లల తల్లిదండ్రులు.. ఇలాంటి దారుణాలు ఇటీవల హృదయాలను కలిచేస్తున్నాయి. చిన్నారుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం గా మారుస్తున్నాయి. ఒక్కసారి ఇటీవల చోటు చేసుకున్న ఇటువంటి దారుణాలను పరిశీలిస్తే..

ఏమిటీ దారుణం.. 

మహబూబాబాద్ మండలంలోని గడ్డ తండాలో ఆరు సంవత్సరాల కూతురినిమూడు సంవత్సరాల కొడుకుని బావిలో పడేసిన తండ్రి తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం భార్య మీద అలిగి తండ్రిలా దారుణానికి పాల్పడడం మంగళవారం వెలుగు చూసింది. ఇంతకంటే దారుణం ఉంటుందా.. ఇదే కాదు ఇటీవల పాల్వంచలో ఆత్మహత్యకు పాల్పడిన నాగ రామకృష్ణ కూడా తన భార్యా పిల్లలను పెట్రోల్ తో తగలబెట్టి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈనెల 8వ తేదీన నిజామాబాద్ కు చెందిన దంపతులు విజయవాడ వెళ్లి తన ఇద్దరు కొడుకులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధ భరించలేక దారుణానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చిం ది. ఇక గత నెల 11వ తేదీన కూడా రాజేంద్రనగర్లో ఓ మహిళ భర్త వేధింపులు భరించలేక 3,4 ఏళ్ల వయసున్న తన ఇద్దరు కూతుళ్లను బలి చేసి, తాను బలైంది. మన రాష్ట్రంలోనే కాదు దేశ నలుమూలల తరచూ ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. 9వ తేదీన బెంగాల్లో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వరుసక్రమంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు హృదయ విదారకంగా మారుతున్నాయి. ఆత్మహత్యకు పాల్పడడం తప్పు.. తమను తాము బలి చేసుకోవడం నేరం.. అలాంటిది తమ పిల్లలను కూడా బలి చేయడం అత్యంత దయనీయమైన సంఘటన.

ఎవరిచ్చారు హక్కు.. 

పిల్లలను కనే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.. కానీ వారిని బలి తీసుకునే హక్కు ఎవరికీ లేదు.. చాలామంది తాము చనిపోతే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటి అని.. ఆలోచిస్తూ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. కానీ అనాథలను చేరదీయడానికివారిని చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా ప్రత్యేక కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల ద్వారా పిల్లల బాగోగు లు చూసుకోవడమే కాదువారిని చదివించి బంగారు భవిష్యత్తును అందిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఇలాంటి వారికి చేయూత అందిస్తున్నాయి. ఇలాంటి సమస్యలను ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన అనాధ పిల్లలు ఎందరో ఉన్నారు. తల్లి దండ్రులు ముందుగా సమస్యలు వచ్చినప్పుడు ఆత్మహత్య మార్గం అన్న విషయాన్ని మరచిపోయి ఆలోచనతో ముందుకు సాగాలి. అంతకుమించి ఒకవేళ తాము చనిపోయినా, తమ పిల్లలు అయినాబతికి ఉండాలని కోరుకోవాలి. అంతేకానీ ఇలా తమ పిల్లలను బలి చేసి వారి బంగారు భవితవ్యానికి అర్ధాంతరంగా ముగించడం అర్ధ రహితం. ఇలాంటివి పునరావృతం కాకుండా తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అంతేకాదు…అనాథ పిల్లలకూ ఉజ్వల భవితను కల్పించగలిగే బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలి. సమాజం కూడా అందుకెు సానుకూలంగా స్పందించాలి.


2022-01-12  News Desk