దేశంలోనే అతి చిన్న రాష్ట్రం గోవా. ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు సమయంలో లేదా ఆ తర్వాత కానీ… ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం ఒక్క ఎం.ఎల్.ఎ మద్దతు ప్రభుత్వం ఏర్పాటుకు కానీ, కూలిపోవడానికి కానీ కీీలకం అవుతుంది. ఇంతవరకూ జరిగిన ఎన్నికల్లోచాలాసార్లు ఇలాగే జరిగింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి వింత పరిస్థితి లేదు.
క్రైస్తవులే మెజారిటీ ఓటర్లు
ఇక ఎన్నికల ముందు కీలకంగా మారే అంశం క్రైస్తవుల ఓట్లు. గోవాలో క్రిస్టియన్ ఓటర్లు ఎక్కువ. ఎన్నికల ఫలితాల్ని వారే ప్రభావితం చేస్తారు. వారు ఎవరికి పట్టం కడతారనేదే ముఖ్యం. అందులోనూ రాష్ట్రంలో చాలా పలుబడి ఉన్న కేథలిక్ చర్చి ఎవరికి మద్దతిస్తే ఆ పార్టీనే మెజారిటీ సాధిస్తుందనే నమ్మకం కూడా నాయకుల్లో ఉంది. మొదట్లో కాంగ్రెస్ కే అధికారం దక్కుతూ వచ్చింది. బిజెపి మతతత్వ పార్టీ అనే ముద్ర ప్రజల్లో ఉండేది. కానీ చర్చి పెద్దలతో మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ మనోహర్ పారీకర్ ఒక ఒప్పందానికి రావడంతో 2012లో మొదటిసారి బిజెపి సొంతంగా అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. పారీకర్ కుమారుడికి పార్టీ టిక్కెట్ రాలేదు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. దాంతో క్రైస్తవులు బిజెపికి దూరం కావచ్చు. పైగా మత రాజకీయాలూ చోటు చేసుకోవచ్చు అని పరిశీలకులు భావిస్తున్నారు.
ఈసారి టిఎంసి, ఆప్ కూడా…
మరో కీలకాంశం కూడా ఈసారి చోటు చేసుకుంటోంది. తృణమూల్ కాంగ్రెస్, కేజ్రీవాల్ పార్టీ ‘ఆప్’ కూడా ఎన్నికల బరిలోకి దిగాయి. మరి కేథలిక్ చర్చి ఎవరికి మద్దతిస్తుందన్నదే సస్పెన్స్ గా మారింది.
కర్ణాటక ప్రభావం?
ఇంకో కీలకమైన అంశం కూడా ఉంది. ఈమధ్య కర్ణాటకలోని చర్చిలపై ఒక మతవర్గంలోని అతివాదులనబడే వారు దాడులు జరిపి విధ్వంసానికి పాల్పడడం వివాదానికి దారితీసింది. అలాగే మతాంతరీకరణ నిరోధక చట్టాల పేరుతో మిషనరీలకు విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారాలు గోవాలో బిజెపీకి వ్యతిరేకంగా మారే అవకాశముందని తెలుస్తోంది. కేథలిక్ లు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు.
వారి స్పందన ఏమిటి?
500 ఏళ్ల కిందట పోర్చుగీసు వారు నాశనం చేసిన ఆలయాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చేసిన ప్రకటన హిందువులకు ఆమోదయోగ్యమే అయినా, క్రైస్తవుల స్పందన ఏమిటన్నది అర్థం కావడం లేదు. అదివరకు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన గోవా రాష్ట్రంలో ఇప్పుడు మతపరమైన అంశాలు చోటుచేసుకోవడం చాలామందికి నచ్చడం లేదు.