హిమాలయాల్లో ఉన్న పుణ్యక్షేత్రాల్లో గంగోత్రి ఒకటి. పైగా ముఖ్యమై‘నది’ కూడా. గంగోత్రిలో గంగాదేవి ఆలయం ఉంది. గంగోత్రికి సంబంధించి పురాణగాథ ఉంది.
పురాణగాథ
సగరుడు అనే రాజు రాక్షస సంహారం తర్వాత పాప పరిహారార్ధం ఆశ్వమేధ యాగం చేశాడు. దేవేంద్రుడు సగరుని వైభవాన్నిచూసి భయపడ్డాడు.సగరుడు తనపదవికి ముప్పు తీసుకొస్తాడేమో అన్న భయంతో సగరుని అశ్వమేధ అశ్వాన్ని అపహరించి కపిల మహర్షి ఆశ్రమంలో బంధిస్తాడు. ఈ విషయం తెలియని 60 వేల సగరుని కుమారులు గుర్రం వెంటవచ్చి కోపంతో కపిల మహాముని ఆశ్రమంలో ప్రవేశిస్తారు. తపోదీక్షలో ఉన్న కపిల మహర్షి తపస్సును భగ్నం చేస్తారు. తన తపోభంగానికి కారణమైన సగరుని కుమారులు 60వేల మందిని కపిలుడు భస్మం చేస్తాడు. సగరుని మనుమడు భగీరథుడు తన పితరుల ఊర్ధ్వలోక గతులకోసం తపస్సుచేసి గంగాదేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు.
గంగాదేవిని స్వర్గంనుండి భూమికి వచ్చి తన పితరులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. అప్పుడు గంగాదేవి-- తనరాక భూమి భరించలేదని దానిని భరించగలిగినవాడు ఒక్క శివుడేనని చెప్పింది. భాగీరథుడు… గంగను భూమికి తీసుకువచ్చే ప్రయత్నంలో సహకరించమని శివుణ్ణి కోరుకుంటాడు. శివుడు అందుకు అంగీకరించి గంగానదిని తన జటాజూటంలో బంధించి మెల్లగా భూమి మీదికి వదిలినట్లు పురాణాలు చెబుతున్నాయి.
గంగావతరణ ఇక్కడే…
పవిత్ర గంగానది ఇక్కడే భూమిపై దిగింది. ఆ నదిని శివుడు గంగా దేవతకు సమర్పించాడు. గంగోత్రిలో హిమానీ నదం (గ్లేషియర్) గోముఖం నుంచి గంగానది తన ప్రయాణాన్ని ఆరంభిస్తుంది. గంగోత్రికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో గోముఖం ఉంది. ఇది గంగోత్రినుండి ఎగువలో పర్వతాలలో ఉంటుంది. గంగోత్రిలో గంగామాతకు ఆలయం ఉంది.
గంగోత్రి ధామ్ సమీపంలో ఉన్న భగీరథ శిల, పాండవ గుహలను యాత్రికులు సందర్శిస్తారు.
ఇక్కడ గంగానదిని ‘భాగీరథి’ అని పిలుస్తారు. భగీరథుడి వల్ల గంగానది వచ్చింది కనుక ఆ పేరు వచ్చింది. దేవ ప్రయాగనుండి గంగానదిలో అలకనందా నది ప్రవేశించే ప్రదేశం ప్రారంభం నుంచి గంగానది అని పిలుస్తారు.
భవిష్య బద్రీ దేవాలయం
ఇక్కడి తపోవనం సమీపంలోని దట్టమైన అరణ్యాల మధ్య ‘భవిష్య బద్రీ’ దేవాలయం ఉంది. భవిష్య బద్రీ దేవాలయం జోషీ మఠానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. తపోవనానికి సమీపంలోని శిఖరంపైన ఉన్న భవిష్య బద్రీ దేవాలయంలో నరసింహస్వామి విగ్రహం ఉంది. భవిష్యత్తులో బద్రీనాథ్ ని చేరుకోలేని పరిస్థితి వస్తుందని అప్పుడు విష్ణుమూర్తి ఈ దేవాలయంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే భవిష్య బద్రీ దేవాలయం అంటారు.
ఎలా చేరుకోవచ్చు?
హరిద్వార్, బుుషీకేశ్, డెహరాడూన్ నుంచి ఒక రోజు ప్రయాణంచేసి గంగోత్రిని చేరవచ్చు. యమునోత్రి నుంచి రెండురోజుల ప్రయాణం చేసి చేరుకోవచ్చు. యమునోత్రి కంటే గంగోత్రికి వచ్చే సందర్శకుల సంఖ్య ఎక్కువ. బస్సు లేదా కారులోకూడా గంగోత్రిని చేరుకోవచ్చు. గంగోత్రిలో గంగా దేవాలయం ముఖ్యమైన దర్శనీయ స్థలం. గంగా దేవాలయంలో ఉన్న గంగాదేవి… దీపావళి నుంచి మే వరకు గంగోత్రి దేవాలయంలోనూ, మిగిలిన రోజుల్లో హార్సిల్ సమీపంలోని ముఖ్బ లోనూ ఉంటుంది.
18వ శతాబ్దం చివర్లో లేదా 19వ శతాబ్దపు ఆరంభంలో గంగాదేవి ఆలయాన్ని గూర్కా జనరల్ అమర్సింఘ్ థాపా నిర్మించినట్టు తెలుస్తుంది. సెమ్వాల్ కుటుంబానికి చెందిన పూజారులు ఇక్కడి సంప్రదాయక పూజలు నిర్వహిస్తారు. గంగానది బాగా వేగంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న గంగాదేవికి ఆరతి ఇచ్చే దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది. పర్వతారోహకులకు గంగోత్రి ముఖ్య కేంద్రం. ఇక్కడి నుండి కొందరు సాహసయాత్రికులు గోముఖ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు.
తెరుచుకున్న ఆలయాలు
చార్ ధామ్ యాత్ర మార్గంలో ఉన్న నాలుగు ఆలయాలు యమునోత్రి, గంగోత్రి, బదరీనాథ్, కేదారనాథ్ ఆలయ ద్వారాలను ఒకే రోజు తెరవరు. ముందు మే 3న ఉత్తర కాశి జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాల్ని తెరిచారు. మే 6న కేదార్ నాథ్, 8వ తేదీ బదరీనాథ్ ఆలయాన్ని తెరిచారు.
చార్ ధామ్ యాత్ర ఎలా చేయాలి?
యాత్రను పశ్చిమం వైపు నుంచి ప్రారంభించి తూర్పు వైపు క్షేత్రాలను దర్శిస్తారు. ఆ ప్రకారం మొదట యమునోత్రితో చార్ ధామ్ యాత్ర ఆరంభమవుతుంది. ఆ తర్వాత గంగోత్రికి వెడతారు. చివర్లో కేదార్ నాథ్, బదరీనాథ్ లను చూస్తారు. యమునోత్రి, గంగోత్రికి వెళ్లిన భక్తులు అక్కడ యమున, గంగా నదుల్లో పవిత్ర జలాలను తీసుకొచ్చి కేదారేశ్వరంలో దేవుడికి అభిషేకిస్తారు.