collapse
...
Home / తెలంగాణ / ఖమ్మం / దేవుడి కార్యక్రమానికి డబ్బులివ్వకపోతే కుల బహిష్కరణా.. ఏంటిది..? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telug...

దేవుడి కార్యక్రమానికి డబ్బులివ్వకపోతే కుల బహిష్కరణా.. ఏంటిది..?

2022-05-12  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

kula-bahishkarana
 

పుట్టినప్పట్నుంచి, చనిపోయే వరకు మనల్ని వీడనిది నీడ ఒక్కటే కాదు. కులం, మతం కూడా.. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. కులం నుంచి వెలివేశాం.. గ్రామం నుంచి వెలివేశాం.. అనే మాటలు కొన్నేళ్ల క్రితం వినిపించేవి. ఇప్పుడు కాలం మారింది.. తరాలూ మారాయ్.. ఇప్పుడు అంత సీన్ లేదు. వెలివేతల గురించి ఇప్పటి తరానికి దాదాపు తెలియదనే చెప్పాలి. కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం ఇంకా వెలివేతలున్నాయి. ముఖ్యంగా కుల బహిష్కరణలు కొన్ని గ్రామాల్లో ఉన్నాయి. కులం నుంచి బహిష్కరించిన కుటుంబాన్ని.. ఆ కులానికి సంబంధించిన వారెవరూ తమ కుటుంబంలో ఎలాంటి వేడుకకు పిలవరు. ఒంటరిని చేస్తారు. కనీసం వారితో మాట్లాడరు. ఈ బహిష్కరణకు గురైన వారి బాధ వర్ణనాతీతం. ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కుల పెద్దల మాట వినలేదని.. మతం మారాడని.. కులం నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పడమే కాదు.. అదనంగా రూ.15 వేల దండుగ(జరిమానా) సైతం కులపెద్దలు విధించారు.

అసలు విషయంలోకి వెళితే...

కూసుమంచి మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన కలకొండ వీరబాబు అనే వ్యక్తి మతం మారాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు కుల పెద్దలు బంగారు మైసమ్మ పేరిట దేవుడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇంటికి 1500చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. తాను క్రిస్టియన్ మతం తీసుకున్నానని.. కాబట్టి బంగారు మైసమ్మ కార్యక్రమానికి డబ్బులు ఇవ్వబోనని.. కేవలం కులానికి సంబంధించిన కార్యక్రమానికి మాత్రమే డబ్బులు ఇస్తానని.. అమ్మవారి కార్యక్రమానికి డబ్బులు ఇవ్వనని చెప్పాడు. అనంతరం ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో చర్చించిన మీదట.. కుల పెద్దలతో గొడవెందుకుని తిరిగి వెళ్లి రూ.1500 ఇవ్వబోగా వారు నిరాకరించారు. కుల పెద్దల మాట వినకుండా వెళ్లావని అందుకే నిన్ను కులం నుంచి వెలి వేస్తున్నట్లు చెప్పారు. అంతటితో ఆగక.. దండుగగా 15 వేలు చెల్లించాలని ఆదేశించారు. తాను రూ.15 వేలు ఇవ్వలేనని.. రూ.1500 మాత్రమే ఇవ్వగలనని చెప్పినా ఒప్పుకోలేదు.  

టాబ్లెట్ కావాలంటే ఇస్తా.. దండుగ విధిస్తే మీరే కట్టాలి..

గత పది రోజులుగా కులానికి సంబంధించిన ఏ కార్యక్రమానికి వెళ్లినా.. ‘నిన్ను వెలి వేశాం.. నువ్వు రావొద్దు.. నువ్వు వస్తే మేము కుల పెద్దలకు దండగా కట్టాలి’’ అని అంటున్నారని వీరబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యకు ఆరోగ్యం బాగలేక ఆశా వర్కర్ వద్దకు వెళ్లినా ఆమె కూడా.. ‘‘నీకు టాబ్లెట్ కావాలంటే ఇస్తా.. కానీ నాకు దండుగ విధిస్తే మీరే కట్టాలి’’ అని అన్నదని బాధితుడు తెలిపాడు. గ్రామంలో తాము అవమానాలు భరించలేక పోతున్నామంటూ బాధిత కుటుంబం బుధవారం మధ్యాహ్నం కూసుమంచి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నిజానికి మతం మారితే కులం కూడా మారిపోతుందా? అన్నది ఇక్కడ ప్రశ్నార్ధకంగా మారింది. నిజానికి కులాన్ని వదిలించుకునేందుకు మతం మారాలనుకునేవారు లేకపోలేదు. ఒకవేళ మతం మారినా కులం వెంటాడుతుంటే ఇక మతం మారడమెందుకు అనే వారూ ఉన్నారు.

కోర్టులు ఏం చెప్పాయంటే..

ఒక మతంలోని వారు మరో మతంలోకి మారితే అతనికి పాత మతంలోని కులం వర్తించదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. వెనుకబడిన తరగతికి చెంది, మతం మారిన ఓ మహళ తనకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణ్యన్ ఈ తీర్పు వెలువరించారు. "ఒక వ్యక్తికి వెనుకబడిన కులం అనేది పుట్టుకతో వస్తుందే తప్ప, అది సామాజిక హోదా కాదు. మతం మారడం ద్వారా అంతకు ముందున్న కుల ముద్ర నుంచి సదరు వ్యక్తి విముక్తుడవుతాడు'' అని న్యాయమూర్తి తెలిపారు.

మతం మారినా కులం మాత్రం మారదని ఇదే మద్రాస్ హైకోర్టు మరో కేసు విషయంలో తీర్పునిచ్చింది..‘ఆది-ద్రావిడ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత కోసం కులాంతర వివాహ ధ్రువీకరణ పత్రం పొందేందుకు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితుడి విషయంలో మద్రాసు హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. ఒక మతం నుంచి మరో మతంలోకి మారినా కులం మాత్రం మారదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత కోసం కులాంతర వివాహ ధ్రువీకరణ పత్రం పొందటానికి క్రైస్తవ మతం తీసుకున్న దళితుడి పిటిషన్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
 



2022-05-12  News Desk