ఆఫ్ఘనిస్థాన్ లో బాలికలు, మహిళలకు హిజాబ్ తప్పనిసరి చేస్తూ తాలిబన్ ప్రభుత్వం ఫర్మానా జారీచేసింది. ఈ పరిస్థితిపై నొబెల్ బహు మతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ భయాందోళనలు వ్యక్తం చేశారు. ‘ఆఫ్ఘనిస్థాన్ లో బాలికల్ని పాఠశాలకు వెళ్లనీయకుండా, మహిళల్ని ఉద్యోగాలు చేయనీకుండా , వారిని బయటికి రానీకుండా తాలిబన్లు ఆంక్షలు విధిస్తున్నారు. కుటుంబంలోని పురుషుడి తోడు లేకుండా ప్రయాణించడానికి వారికి అర్హత లేదని , మహిళల సామాజిక జీవితాన్ని తుడిపెట్టాలని చూస్తున్నారు. మహిళలు , బాలికలు తమ ముఖం , శరీరం కనిపించకుండా పూర్తిగా కప్పుకోవాలని బలవంతం చేస్తున్నారు’ అని మలాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.లక్షలాది మంది ఆఫ్ఘన్ మహిళలు , బాలికలకు ఉన్న మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నందుకు ప్రపంచ నాయకులు తాలిబన్లను బాధ్యులుగా చేస్తూ సమష్టిగా చర్య తీసుకోవాలని ఆమె ఒక ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు.
వారికి చేయూత నివ్వాలి
తాలిబన్లు తమ వాగ్దానాల్ని పదే పదే ఉల్లంఘిస్తున్నందున, ఆఫ్ఘనిస్థాన్ మహిళలకు చేయూత ఇవ్వాలని, వాళ్లను జాగరూకుల్ని చేయా లన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. అక్కడ ఇప్పటికీ స్త్రీలు తమ హక్కులు, గౌరవం కోసం వీధుల్లో కొచ్చి పోరాడుతున్నారు. ముఖ్యంగా ముస్లిం దేశాల్లో ఈ పరిస్థితి ఉంది. కాబట్టి మనం వారికి అండగా నిలవాలి – అని కూడా మలాలా కోరారు. ఆఫ్ఘన్ మహిళలకు తల నుంచి కాళ్ల వరకు ఆచ్ఛాదన ఉండాలని తాలిబన్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గూటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
నిరసనల వెల్లువ
తాలిబన్ల ఈ నిర్ణయంపై మానవ హక్కుల పరిశీలకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
క్రమక్రమంగా తాలిబన్ ప్రభుత్వం ఆఫ్ఘన్ మహిళల మానవ హక్కుల్ని తుడిచిపెడుతోందని విలేకరి రిచర్డ్ బెన్నెట్ చెప్పారు. చదువు , బయటికి వెళ్లడం, ఉద్యోగం, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న సమయాల్లో మహిళలు తప్పనిసరిగా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచుకోవాలని తాలిబన్లు తాజా శాసనం చేసిన మర్నాడు రిచర్డ్ బెన్నెట్ ఈ విధంగా స్పందించారు.
‘మానవ హక్కుల ఉల్లంఘన పరిణామాల పట్ల అంతర్జాతీయ సమాజం చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చింది’ అని ఆయన ఒక ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు.
మానవ హక్కుల్ని , మహిళల హక్కుల్ని పరిరక్షించేందుకు తాము కట్టుబటి ఉన్నట్టు ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈ హామీని అంతర్జాతీయ సమాజం చాలావరకు గుర్తించలేదు.
సమితి ఆందోళన
తాలిబన్ ప్రభుత్వం మహిళలకు విధించిన ఆంక్షలపై ఆఫ్ఘనిస్థాన్ లోని ఐక్యరాజ్య సమితి దౌత్య బృందం ఆందోళన చెందింది. మహిళలు, బాలికలతో సహా ఆఫ్ఘనిస్థాన్ ప్రజల మానవ హక్కులన్నింటినీ పరిరక్షిస్తామని, హక్కుల్ని గౌరవిస్తామని తాలిబన్లు ఎన్నో హామీ లిచ్చారు. ఇప్పుడు అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందుకు విరుద్ధంగా ఉంది…అని ఆ బృందం విమర్శించింది.
అమెరికా హెచ్చరిక
ఆఫ్ఘనిస్థాన్ మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ను పాటించాలని తాలిబన్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై అమెరికా ఘాటుగా స్పందిం చింది. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే తాలిబన్లపై వత్తిడి పెంచుతామని హెచ్చరించింది. అమెరికా విదేశాంగ శాఖ ఈ హెచ్చరిక జారీ చేసింది.