collapse
...
Home / తెలంగాణ / హైదరాబాద్ / ఆఫీస్ వద్దు.. వర్క్ ఫ్రమ్ హోం ముద్దు.. రమ్మంటే రాజీనామా..! - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu New...

ఆఫీస్ వద్దు.. వర్క్ ఫ్రమ్ హోం ముద్దు.. రమ్మంటే రాజీనామా..!

2022-05-13  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

wrk-frm-home

టెక్ రంగంలో అనూహ్య పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దాదాపు రెండేళ్లపాటు వర్క్ ఫ్రం హోంకు అలవాటు పడిన ఉద్యోగులు తిరిగి ఆఫీస్ నుంచి పనిచేసేందుకు విముకత తెలియజేస్తున్నారు. కార్యాలయాల నుంచి పని చేయాల్సి వస్తే రాజీనామాలకైనా వెనుకాడడం లేదు. ఈ ట్రెండ్ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో కనిపిస్తోంది. కొవిడ్ మహమ్మారి వల్ల అనివార్యమైన పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోం విధానం ప్రధానమైనది. ముఖ్యంగా టెక్‌తోపాటు ఇతర మరికొన్ని రంగాల్లో రెండేళ్ల నుంచి ఈ విధానం కొనసాగుతోంది. ఈ సుధీర్ఘ సమయంలో ఉద్యోగుల జీవన విధానం, ఆలోచనా వైఖరిలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంటి నుంచే పనిచేసేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరిణామమే ప్రస్తుతం టెక్ కంపెనీలను కలవరానికి గురిచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రెండ్ కనిపిస్తోంది. ఏకంగా రూ.8 కోట్ల వార్షిక వేతనం తీసుకుంటున్న యాపిల్ కంపెనీ ఉద్యోగి ఒకరు తిరిగి ఆఫీస్‌కు రమ్మంటే రాజీనామా చేశాడు. ఈ అంశం గ్లోబల్ టెక్ రంగంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇందుకు భారతేమీ మినహాయింపు కాదు. తిరిగి ఆఫీస్‌కు వెళ్లడం కంటే ఉద్యోగం మానేయడం మేలని భావిస్తున్న ఉద్యోగుల సంఖ్య భారత్‌లోనూ పెద్దగానే ఉంది. ఎడ్యుటెక్ కంపెనీకి చెందిన ఉద్యోగుల్లో 800 మంది కేవలం 2 నెలల వ్యవధిలో రాజీనామా చేయడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది.

ఆఫీస్‌కు రమ్మంటే రాజీనామా..!
ఎడ్యుటెక్ సంస్థ వైట్‌హ్యాట్‌ జూనియర్‌కు చెందిన 800 ఉద్యోగులు కేవలం 2 నెలల వ్యవధిలోనే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. నెల వ్యవధిలో తిరిగి ఆఫీస్‌ నుంచి కార్యకలాపాలు కొనసాగించాలని యాజమాన్యం కోరడమే ఇందుకు కారణమైంది. ఈ మేరకు మార్చి 18న ఉద్యోగులకు కంపెనీ ఈ-మెయిల్స్ పంపించింది. ఆఫీస్ నుంచి పనిచేయాలనుకోవడం లేదని కారణం చెప్పారు. వీరంతా స్వచ్ఛంధంగా తమ ఉద్యోగాలను వదిలేశారు. నెల రోజుల వ్యవధిలో ముంబై, బెంగళూరు, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లోని తమ కార్యాలయాలకు తిరిగి హాజరుకావాలని కంపెనీ పేర్కొంది. ఆఫీస్ ఆదేశాలను పాటించకపోగా పెద్ద సంఖ్యలో రాజీనామాలు పంపించారని ఐఎన్‌సీ42 రిపోర్ట్ పేర్కొంది. కంపెనీ వ్యవహారాలను బజాజ్ పర్యవేక్షించినంత వరకు పరిస్థితులు బాగానే ఉన్నాయి. కానీ వైట్‌హ్యాట్ జూనియర్‌ను 2021లో బైజూస్ 300 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితులు మారాయని చెబుతున్నారు. వర్క్ ఫ్రం ఆఫీస్ చేయబోమని ఖరాఖండీగా చెబుతున్నారు.

కంపెనీ ఏం చెబుతోందంటే..
వర్క్ ఫ్రం ఆఫీస్ విధానంలో భాగంగా కంపెనీకి చెందిన సేల్స్ అండ్ సపోర్ట్ ఉద్యోగుల్లో అత్యధికులను ఏప్రిల్ 18 కల్లా ముంబై, గురుగ్రామ్‌లలో రిపోర్ట్ చేయాలని కోరామని ప్రస్తావించింది. మెడికల్, వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన  మినహాయింపులతోపాటు అవసరమైతే రీలోకేషన్ సహకారం కూడా ఉంటుందని చెప్పామని పేర్కొంది. అయినా ఉద్యోగులు రాజీనామాలకే మొగ్గుచూపారని పరిస్థితిని వివరించింది. అయితే టీచర్లు వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తారని కంపెనీ స్పష్టం చేసింది. కాగా కోడింగ్ నేర్పించే ప్లాట్‌ఫామ్ అయిన వైట్‌హ్యాట్ జూనియర్‌ను 2021లో ఎడ్యుటెక్ దిగ్గజం బైజుస్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా ఇదే వరుస..
వర్క్ ఫ్రం ఆఫీస్‌ను ఇష్టపడబోమని చెబుతున్న టెక్ ఉద్యోగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు కనిపిస్తునే ఉన్నాయి. ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ కూడా వర్క్ ఫ్రం ఆఫీస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ మేరకు ఉద్యోగులకు సందేశాలు పంపించింది. కానీ ఈ ఆదేశాలు ఉద్యోగులకు రుచించలేదు. వర్క్ ఫ్రం ఆఫీస్‌కు వ్యతిరేకమని వారు తేల్చిచెప్పారు.ఈ ఆదేశాలకు వ్యతిరేకమంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. టెక్ సంస్థల వార్తలను ప్రచురించే ప్రముఖ వెబ్‌సైట్ ది వెర్జ్ రిపోర్ట్ ప్రకారం.. యాపిల్‌కు చెందిన మెషిన్ లెర్నింగ్ డైరెక్టర్ ఇయాన్ గుడ్‌ఫెలో తిరిగి ఆఫీస్ నుంచి పనిచేయడం ఇష్టం లేక రాజీనామా చేశాడు. అతడి జీతం ఏడాదికి ఏకంగా రూ.8 కోట్లు పైమాటే. ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించాలంటూ యాపిల్ సీఈవో టిమ్ కుక్ చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణమని చెప్పాడు. ఫార్చూన్ రిపోర్ట్ ప్రకారం.. వర్క్ ఫ్రం హోం చేస్తున్న యాపిల్ ఉద్యోగుల్లో 76 శాతం మంది తిరిగి ఆఫీస్‌కు వచ్చేందుకు అయిష్టత వ్యక్తం చేశారు.

టిమ్‌ కుక్‌కు గుడ్‌ఫెలో మెయిల్..
తిరిగి ఆఫీస్ నుంచి పనిచేయాలనే నిబంధనపై గుడ్‌ఫెలో అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ మేరకు టిమ్‌ కుక్‌కు ఈ మెయిల్ పెట్టాడు. వర్క్ ఫ్రం హోంతో ఉత్పాదకత పెరుగుతుందని చెప్పారు. తన టీం సభ్యుల పని వెసులుబాటు పరిస్థితులే తనకు ముఖ్యమని చెప్పాడు. వాళ్లకి బాగుంటే ఫలితం బాగుంటుందని ఈ -మెయిల్‌లో స్పష్టంగా వివరించాడు. కాగా వార్షిక వేతనం ఏకంగా రూ.8 కోట్లు తీసుకునే వ్యక్తి కూడా త్రుణప్రాయంగా రాజీనామా చేయడం టెక్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.2022-05-13  News Desk