వారాణసిలోని జ్ఞానవాపి మసీదు వద్ద సర్వేను నిలిపివేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అక్కడ సర్వే , వీడియోగ్రఫీ నిలిపివేయాలని , యధాతథ స్థితిని కొనసాగించాలని , తమ ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ హుఫేజా అహ్మది అనే లాయర్ కోరారు. అయితే రానున్న రోజుల్లో దీన్ని విచారిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. ఈ స్థలం వద్ద రోజువారీ సర్వే జరగాలని , వీడియోగ్రఫీ నిర్వహించాలని , కాశీ విశ్వనాథుని ఆలయ సమీపంలోని మసీదులో దేవతా విగ్రహాలు ఉన్నాయనడానికి ఆధారాలు సేకరించాలని వారణాసి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హుఫేజా అహ్మది తన పిటిషన్ లో ప్రస్తావించారు. ఇవి ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించేవిగా ఉన్నాయన్నారు. కానీ నిజానికి అక్కడ ఎప్పటి నుంచో మసీదు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా యధాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలివ్వాలని ఇంతెజామియా మసీదు కమిటీ తరఫున వాదిస్తున్న ఈయన కోరారు. అయితే.. తాము దీనికి సంబంధించిన పేపర్లను చూడలేదని , అసలు విషయమేమిటో తమకు తెలియదని సీజేఐ రమణ అన్నారు. మాకేమీ తెలియదు.. ఇలాంటప్పుడు ఎలా ఉత్తర్వులిస్తాం అని ఆయన ప్రశ్నించారు. తాము సంబంధిత పత్రాలను పరిశీలించి ఆదేశాలు ఇస్తామని ఆయన చెప్పారు. ఇలా ఉండగా ఈ మసీదు వద్ద సర్వే , వీడియోగ్రఫీల నిర్వహణకు పోలీసులు కూడా తాము నియమించిన లాయర్లకు సహకరించాలని స్థానిక కోర్టు ఆదేశించింది. అవసరమైతే మసీదులో ఏ తాళాన్నయినా పగులగొట్టేందుకు జిల్లా అధికారులకు , పోలీసులకు కోర్టు అధికారాలనిచ్చింది. ఎవరైనా ఈ సర్వే , వీడియోగ్రఫీలకు అడ్డు పడిన పక్షంలో వారిపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయాలని కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ విషయంలో అధికారులు ఎవరైనా ఉదాసీనంగా వ్యవహరిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరింది. పైగా తమ ఉత్తర్వులను జిల్లా అధికారులు పాటించకపోవడం పట్ల కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వీరు సహకరించి ఉంటే ఈ పాటికి సర్వే పూర్తయి ఉండేదని సివిల్ జడ్జి అభిప్రాయపడ్డారు , అందువల్లే ఈ నెల 17 లోగా దీన్ని పూర్తి చేయాలని ఆదేశిస్తున్నామన్నారు .
నీట్ పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు తిరస్కృతి
నీట్ పీజీ- 2022 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది, ఈ పరీక్షలకు ప్రిపేరవుతున్న లక్షలాది విద్యార్థులకు ఇబ్బంది కలుగజేయజాలమని జస్టిస్ డీ.వై.చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ పేర్కొంది. దీన్ని వాయిదా వేయడం వల్ల గందరగోళం, అయోమయ పరిస్థితి ఏర్పడుతుందని, ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత కూడా తప్పని పరిస్థితి కలుగుతుందని న్యాయమూర్తులు అన్నారు. సుమారు 2 లక్షలమందికి పైగా విద్యార్థులు నీట్ పీజీ-2022 పరీక్షకు హాజరవుతున్న విషయాన్నీ వారు ప్రస్తావించారు. ఈనెల 21 న జరగనున్న ఈ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ .. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయను కోరింది. నీట్ పీజీ-2021 కౌన్సెలింగ్ లో జాప్యం జరిగినందున దీన్ని వాయిదా వేసేందుకు అనుమతించాలని ఈ సంస్థ పలుమార్లు కేంద్రాన్ని అభ్యర్థించిన అనంతరం.. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. కాగా దీన్ని వాయిదా వేసిన పక్షంలో అది పేషంట్ కేర్, డాక్టర్ల కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కరోనా పాండమిక్ కారణంగా వైద్య రంగం వెనుకబడిందని అందువల్ల.. దీని నివారణకు , మేం సూచిస్తున్న టైం షెడ్యూల్ కి కట్టుబడి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా నీట్ ను తమిళనాడు రాష్ట్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.. దీన్ని వ్యతిరేకిస్తూ తమ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలను కూడా ప్రభుత్వం ఆమోదించింది. దీనిపై గవర్నర్ రవికి, సీఎం స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ బిల్లును గవర్నర్ తిప్పి పంపడం పట్ల స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, దీన్ని నేరుగా ఆయన రాష్ట్రపతివద్దకే పంపాలని కోరడం తెలిసిందే.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకునే ఈ నీట్ అక్కర్లేదని తమిళనాడు సర్కార్ గట్టి పట్టుదలతో ఉంది.