ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లు ఈ ఏడాది కాస్తా నెమ్మదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విడి భాగాల కొరత అని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ షిప్మెంట్ మూడు శాతం క్షీణించే అవకాశాలున్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చి తాజా త్రైమాసికం స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్ అంచనాల గురించి ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అంటే 2022లో షిప్మెంట్ 1.36 బిలియన్ యూనిట్లకు పరిమితం కావచ్చునని, క్రితం ఏడాది అంటే 2021లో 1.39 బిలియన్ యూనిట్లని వెల్లడించింది. కాగా మొత్తానికి చూస్తే ఈ ఏడాది సరఫరా పరిస్థితి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మెరుగుపడుతుందని తెలిపింది. అయితే ఈ ఏడాది కూడా కొన్ని విడిభాగాల కొరత సమస్య పరిష్కారం కాలేదని పేర్కొంది.
అయితే విడిభాగాల కొరత నుంచి గట్టెక్కినట్లే కనిపించినా.. తిరిగి చైనాలో కరోనా వైరస్ పునరావృతం కావడంతో చైనా లోని అతి పెద్ద నగరాలు లాక్డౌన్ కింది వెళ్లిపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని వివరించింది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో దాని ప్రభావం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. చైనాలో ఫ్యాక్టరీలు మూతపడ్డంతో పాటు రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.
రెండో అంశం ఏమిటంటే వినియోగదారుల సెంటిమెంట్కూడా గణనీయంగా తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, ఉక్రెయిన్ - రష్యాల మద్య యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగడంతో దాని ప్రభావం అన్నీ దేశాల ద్రవ్యోల్బణంపై కనిపిస్తోంది. మరో అంశం ఏమిటంటే అమెరికా సెంట్రల్ బ్యాంకు కీలక వడ్డీరేట్లు పెంచడంతో డాలర్ కాస్తా బలహీనపడింది. అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచడంతో అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు మూలధనం కొరతతో పాటు అధిక ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్నాయి.
కౌంటర్ పాయింట్ రీసెర్చి సీనియర్ ఎనలిస్టు లిజ్ లీ మాట్లాడుతూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి కోలుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మే చివర్లో చైనా ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చసి ఆర్థిక వ్యవస్థ స్థిరపడేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఉద్దీపన పథకాలను ప్రకటించే అవకాశం ఉందని లిజ్ లీ అంచనా వేశారు. కాగా స్యాంసంగ్ ఫోల్డ్‌బుల్ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరిస్తుందని.. దీంతో ప్రీమియం మార్కెట్లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పుంజుకుంటుందని తెలిపారు.
అయితే ఈ ఏడాది రెండవ త్రైమాసికంలోకంపెనీల ఫలితాలు అంచనా కంటే బలహీనంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో 5జీ డివైసెస్ ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయని లీజ్ లీ పేర్కొన్నారు.
కౌంటర్‌పాయింట్ రీసెర్చి వైస్ ప్రెసిడెంట్ పీటర్ రీచర్డ్సన్ మాట్లాడుతూ చౌకరకం.. మిడ్‌సైజ్ 5జీ ఫోన్లు గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయడంతో 5జీ డివైజెస్ గణనీయంగా వృద్ది చెందుతుందని అన్నారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పుంజుకోవడానికి 5జీ స్మార్ట్ఫోన్లను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సి ఉంటుంది. దీనిపై రాయితీలు ప్రకటిస్తే.. వినియమోగదారుడు 4 జీ నుంచి 5జీకి మారిపోయే అవకాశం ఉంటుందని రిచర్ట్సన్ అంచనా వేశారు.
కాగా 2019లో స్మార్ట్షిప్మెంట్ 1.47 బిలియన్ స్మార్ట్ఫోన్లకు ఎగబాకగా.. కరోనా వల్ల లాక్డౌన్ వల్ల షిప్మెంట్ 2020లో 1.33 బిలియన్ యూనిట్లకు దిగివచ్చింది. అటు తర్వాత 2021లో తిరిగి 1.39 బిలియన్ యూనిట్ల షిప్మెంట్ జరిగిందని కౌంటర్ పాయింట్ వివరించింది.
మరిన్ని బిసినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి