Courtesy:Twitter/@SnakeEyesOS
జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్ బుల్ ముజాహిదీన్ కమాండర్ హతమయ్యాడు. ముగ్గురు సైనికులు, ఓ పౌరుడు గాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ లో నిసార్ ఖాండే అనే ఉగ్రవాది మృతి చెందాడని, ఘటనా స్ధలం నుంచి ఏకె 47 రైఫిల్ ని, మందుగుండు సామాగ్రిని, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు జమ్ము కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ జిల్లాలోని రిషీపోరా ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం చాలాసేపు ఎదురుకాల్పులు జరిగాయని ఆయన ట్వీట్ చేశారు. జవాన్లలో ముగ్గురు, ఒక పౌరుడు గాయపడ్డారని, వీరిని తక్షణమే ఆసుపత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు గ్రెనేడ్లను విసరడంతో ఇద్దరు కూలీలు గాయపడ్డారని ఆయన వివరించారు. కొన్ని నెలలుగా జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులు పలువురిని తామ టార్గెట్లుగా ఎంచుకున్నారు. గత నెలలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ మహిళతోసహా ఆరుగురు మృతి చెందారు. మే 12 న రాహుల్ భట్ అనే ప్రభుత్వ ఉద్యోగి, మరునాడు రియాజ్ అహ్మద్ ఠాకూర్ అనే కానిస్టేబుల్ మరణించగా .. అదే నెలలో 24 న సైఫుల్లా ఖాద్రి అనే మరో కానిస్టేబుల్ మృతి చెందాడు. మే 25 న ఉగ్రవాదుల కాల్పుల్లో అమ్రీన్ భట్ అనే కాశ్మీరీ టీవీ నటి మరణించగా.. ఆమె మేనకోడలు గాయపడింది. 31 న రజినీ బాల అనే హైస్కూల్ టీచర్ ప్రాణాలు కోల్పోయింది. ఈమె కాశ్మీరీ పండిట్ అని తెలిసింది. కాగా ఈ హింస ఆగలేదు. ఈ నెల 2 న బ్యాంకు ఉద్యోగి విజయ్ కుమార్ ని టెర్రరిస్టులు బ్యాంకులో ప్రవేశించి కాల్పులు జరిపారు. కుల్గామ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించేలోగా మరణించాడు. బద్గామ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు ఇటీవల ప్రభుత్వ కార్యాలయం లోకి ప్రవేశించి కాల్పులు జరపడంతో ఓ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు.
ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రయోజనం పొందిన కాశ్మీరీ పండిట్లను టెర్రరిస్టులు తమ టార్గెట్లుగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల భయంతో కాశ్మీర్ లోయ నుంచి అనేకమంది హిందువులు, పండిట్లు మళ్ళీ వలసబాట పట్టవచ్చునన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు వివిధ జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు బయల్దేరుతున్నారని వార్తలందుతున్నాయి. ప్రధానమంత్రి పునరావాస ప్యాకేజీ కింద సాయం పొందిన పండిట్లు ఇటీవల లోయ నుంచి వెళ్లిపోతుండగా వారిని అధికారులు, భద్రతా దళాలు అడ్డుకోవడంతో దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నిరసన తెలుపుతున్నవారిని జవాన్లు అడ్డుకుని.. తిరిగి తమ తమ జిల్లాలకు వెళ్లాల్సిందిగా ఒత్తిడి చేశారు. కానీ ఇందుకు వారు నిరాకరించారు. మరో రెండు రోజుల్లో తాము కాశ్మీర్ నుంచి నిష్క్రమిస్తామని సుమారు 4 వేలమందికి పైగా పండిట్ ఉద్యోగులు హెచ్చరించారు. సామూహికంగా తాము వలస వెళ్లిపోతామని ఈ ఉద్యోగులు పేర్కొన్నారు. ఇక్కడ తమ ప్రాణాలకు భద్రత లేదని, ఏ క్షణమైనా టెర్రరిస్టులు తమపై దాడులు చేయడం ఖాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండిట్ ఉద్యోగ సంఘాల నాయకులతో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ అధికారులు చర్చలు జరిపినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. ముఖ్యంగా కుప్వారా, పుల్వామా, బారాముల్లా, అనంతనాగ్, కుల్గామ్, షోపియాన్ జిల్లాల్లోని పండిట్ ఉద్యోగులు ఏ క్షణమైనా తాము తిరిగి వలస వెళ్తామని హెచ్చరిస్తున్నారు. హిజ్ బుల్, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రరిస్టులు పోలీసు కాల్పుల్లో మరణిస్తున్నప్పటికీ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఉగ్రవాద బృందాలు ఏదో ఒకవిధంగా కాశ్మీర్ లోకి దొంగచాటుగా చొరబడుతూనే ఉన్నారు. కాగా లోయలో మైనారిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేశామని జె అండ్ కె అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. మొత్తం 10 జిల్లాల్లోని ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని వారు పేర్కొన్నారు. అటు కాశ్మీర్ లో పరిస్థితి నానాటికీ దిగజారుతోందని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి