6tvnews

collapse
...
Home / అంతర్జాతీయం / అంతా 20 నిమిషాల వ్యవధిలోనే..

అంతా 20 నిమిషాల వ్యవధిలోనే..

2021-12-10  International Desk

TENNIS STAR
Courtesy: twitter/ajplus

చైనీస్ ఇంటర్నెట్ లో పాలకపక్షానికి రుచించని విషయం ఏదైనా ప్రత్యక్షమైందంటే చాలు దాన్ని కట్టడి చేసేందుకు జామర్లు క్షణాల్లో రంగంలోకి దిగుతాయి. ఆ వార్త విస్తతంగా ప్రజా బాహుళ్యంలోకి వెళ్లకముందే నిమిషాల వ్యవధిలో దాని కట్టడి చేసే పనిని భుజాన వేసుకుంటాయి. అలాంటి సంఘటనే ఒకటి డ్రాగన్ కంట్రీలో ఇటీవల చోటుచేసుకుంది. అధ్యక్షుడు జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితుడైన ఉన్నతాధికారి జాంగ్ గావోలి తనను లైంగికంగా వేధించాడని ఆ దేశ టెన్నిస్ స్టార్ , వింబుల్డన్ విజేత పెంగ్ షువాయి నవంబర్  2 న వీబో(చైనా ట్విట్టర్)లో పెట్టిన పోస్టు సంచలనాత్మకమైంది. క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావడంతో చైనా ప్రభుత్వ ఆగమేఘాల మీద నష్ట నివారణ చర్యలకు పూనుకుంది.  

అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. 

20 నిమిషాల వ్యవధిలో అంతా చక్కబెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం గూడుకట్టుకోకముందే జరుగుతున్న తతంగాన్ని తప్పుదారి పట్టించింది. న్యూయార్క్ టైమ్స్ , ప్రొపబ్లికా పరిశోధనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బహుముఖాల ప్రాపగాండ(దుష్ప్రచారం)కు తెరతీసింది. అంతేకాకుండా పెంగ్ ఆరోపణలు ప్రపంచాన్ని పూర్తిగా చుట్టేయకుండా ఇంటర్నెట్ పై నియంత్రణ విధించడంతో పాటు దానిపై చర్చ జరగకుండా డిజిటల్ స్పేస్ ను ఉపయోగించుకుంది. అధికార యంత్రాంగం చేత నకిలీ ఖాతాలు స ` ష్టించి పెంగ్ అనుకూల విమర్శకులపై ఎదురుదాడి మొదలు పెట్టింది. అంతటితో ఆగకుండా నెటిజన్ల కు అందుబాటులో లేకుండా ఇంటర్నెట్ నుంచి వందలాది కీలక పదాలను నిషేధించింది అని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన గ్జియావో కియాంగ్ వెల్లడించారు. ఈయన ఇంటర్నెట్ ఫ్రీడమ్ పై పరిశోధనగావిస్తున్నారు. పెంగ్ షువాయి పోస్టుకు వెల్లువెత్తిన కామెంట్లను తొలగించారు. పెంగ్ పేరిట ఉన్న ఆర్టికల్స్ ను కూడా ఇంటర్నెట్ నుంచి తుడిచిపెట్టేశారు. ఆమె వీబో ఖాతాను సెర్చ్ ఇంజిన్ లో కూడా నెటిజన్లు వెతకకుండా కట్టడి చేశారు.   

ప్రముఖుల సామాజిక ఖాతాలూ డిలీట్ 

పెంగ్ షువాయికి అనుకూలంగా వీబో లో గొంతుకు విప్పుతున్న ప్రముఖులు , సెలెబ్రిటీలు , క్రీడాకారులు , మేధావుల ఖాతాలను కూడా చైనా అధికారులు తొలగించారు.   అయితే పెంగ్ కేసు విభిన్నమైనదని , అప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యాప్తి చెందడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగిందని గ్జియావో అభిప్రాయ పడ్డారు. అయితే పెంగ్ ను దీర్ఘకాలం కట్టడి చేయడం సులువైన పనికాదన్నారు. అయితే మొత్తానికి టెన్నిస్ ప్రపంచం కూడా పెంగ్ కు మద్దతుగా మాట్లాడడం మొదలు పెట్టింది. మహిళల టెన్నిస్ అసోసియేషన్ తో పాటు ప్రముఖ ఆటగాళ్లు నొవామి ఓసాకా , జోకోవిచ్ తదితరులు బహిరంగంగా పెంగ్ జాడపై ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఆమె పేరిట హ్యాష్ ట్యాగ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసేలా చేసింది.   దీంతో చైనా అధికార మీడియా చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్ వర్క్(సిజిటిఎన్) రంగంలోకి దిగింది. తనపై లైంగిక దాడి జరగలేదని , తనను ఒంటరిగా వదిలేయండి అంటూ పెంగ్ షువాయి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని ఓ స్క్రీన్ షాట్ ను ప్రచారంలోకి తీసుకువచ్చింది. అయితే చైనా ప్రభుత్వ మీడియా చేసిన ఈ దుష్ర్ర్పచారం బెడిసికొట్టింది. ఆ ఇ-మెయిల్ స్ర్కీన్ షాట్ పై మౌస్ కర్సర్ దర్శనమివ్వడంతో ఇదంతా తప్పుడు ప్రచారం అని తేలిపోయింది. ఆ సమాచారాన్ని రాసింది ఎవరు అన్న ప్రశ్న తలెత్తింది.   

విమర్శలు వెల్లువ 

ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో చైనా దాన్ని ఎదుర్కోవడానికి మరో కొత్త పథకంతో ముందుకొచ్చింది. సిజిటిఎన్ రిపోర్టర్ ఒకరితో పెంగ్ ఫొటోలను ప్రసారం చేయించింది. వాటిల్లో పెంగ్ బొమ్మలతో నిండిపోయిన ఒక గదిలో పిల్లితో కాలక్షేపం చేస్తున్నఫొటోలను విడుదల చేయించింది. దీనిపై కూడా అనుమానాలు రేకెత్తాయి. ఇక ఇప్పుడు గ్లోబల్ టైమ్స్ (చైనాలో కమ్యూనిస్టు పార్టీ వార్తా పత్రిక) చీఫ్ ఎడిటర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. పెంగ్ బీజింగ్ లోని ఓ రెస్టారెంట్ కొంత మందితో కలిసి డిన్నర్ చేస్తున్న వీడియో క్లిప్ ను పోస్టు చేశారు. ఆ తెల్లవారి చైనా అధికారికంగా నిర్వహించే యూత్ టెన్నిస్ టోర్నీలో పెంగ్ ముఖ్య అతిథిగా హాజరైన ఫొటోలతో పాటు చిన్నారులకు టెన్నిస్ బంతులపై సంతకాలు చేస్తూ ఉన్న ఫొటోలను చైనా అధికారిక మీడియా విడుదల చేసింది. దీంతో అప్పటి వరకు పెంగ్ షువాయి జాడపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు అంతర్జాతీయ ఒలిపింక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ తో పెంగ్ మాట్లాడిన వీడియో క్లిప్ కూడా వెలుగుచూసింది.   


2021-12-10  International Desk