6tvnews

collapse
...
Home / అంతర్జాతీయం / Corona: అమెరికన్ల బతుకు ఇక అంతేనా..?

Corona: అమెరికన్ల బతుకు ఇక అంతేనా..?

2022-01-13  News Desk

coronavirus (2)
 

అంతర్జాతీయంగా కొవిడ్ వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 27.72లక్షల కేసులు నమోదయ్యాయి. 7,800మంది మహమ్మారి బారిన పడి మరణించారు. లక్షణాలు కనిపించకుండానే అంతర్గతంగా వైరస్ వ్యాప్తి ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. కొందరిలో తమకు వైరస్ ఉన్న విషయం కూడా తెలియక చికిత్సకు దూరంగా ఉంటున్నారు. తద్వారా మరణం అంచులకు వెళ్లే వరకు పరిస్థితి వస్తోందని పలు దేశాలకు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 

అతలాకుతలం…

 

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. అక్కడ వెలుగుచూస్తున్న కేసుల్లో అత్యధికంగా అవే ఉంటున్నాయి. అగ్రరాజ్యంలో కొత్తగా 6,72,872 కేసులు వెలుగు చూశాయి. 2150 మంది మరణించారు. వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, అయినప్పటికీ వైరస్ వ్యాప్తి ఊహించనంత వేగంగా సాగుతోందని వైద్య నిపుణులు, ప్రభుత్వ యంత్రాంగం తలలుపట్టుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వైరస్ బారిన పడ్డ వైద్యులను కూడా రోగులకు చికిత్స అందించడానికి రావాలని ఆదేశాలిచ్చామంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. నిత్యవసరాలకు కూడా ప్రజలు నానాతంటాలు పడుతున్నారు. 

 

ఫ్రాన్స్ లో…

 

మరోవైపు ఫ్రాన్స్ లో ఒక్కరోజే 3.68లక్షల మందిలో వైరస్ బయటపడింది. 340మంది ప్రాణాలు విడిచారు. ఒమిక్రాన్ ను అడ్డుకోవడం సాధ్యం కాని పని అని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని పౌచీ అన్నారు. ప్రతి ఒక్కరిని ఈ వేరియంట్ తాకి తీరుతుందన్నారు. కొవిడ్ తో అమెరికా ప్రజలు కలిసి జీవించాల్సిందేనని కుండబద్ధలు కొట్టారు. కరోనా అంతమవుందన్నది అభూత కల్పనేనని పౌచీ అభిప్రాయపడ్డారు. 

 

మేం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం : రష్యా 

 

ఒమిక్రాన్ అత్యధిక వ్యాప్తితో రష్యాలో కరోనా కొత్త కేసుల ఉప్పెన ముంచుకు వస్తోందని, ఇప్పుడు తామంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని   ఉన్నత స్థాయి అధికార వర్గాల సమావేశంలో రష్యా ప్రధాని పుతిన్ వెల్లడించారు. ఈ పరిస్థితి నుంచి దేశం బయటపడేందుకు ఆరోగ్య భద్రతా వ్యవస్థ ఉద్యమించాలని ఆయన సూచించారు. రష్యాలో సోమవారం 15,000 కేసులు నమోదు కాగా, మంగళ, బుధవారాల్లో 17,000 వరకు కేసులు పెరిగాయని రష్యా కరోనా టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. మంగళవారం ఒమిక్రాన్ కేసులు 305 నమోదు కాగా, బుధవారం రెట్టింపు సంఖ్యలో 698 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

 

ఆగ్నేయాసియాలో భయంకరమైన పెరుగుదల...

 

 గత వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు అంతగా లేకపోయినప్పటికీ, కొత్త కేసులు 55 శాతం అంటే దాదాపు 15 మిలియన్ల వరకు పెరిగాయని, మరణాలు 43,000 వరకు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఆగ్నేయాసియాలో కొత్త కేసులు 400 శాతం వరకు అమాంతంగా పెరిగిపోవడం విశేషం. భారత్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లో కేసులు భారీ సంఖ్యంలో పెరిగాయి. ఆగ్నేయాసియాలో 6 శాతం వరకు మరణాలు తగ్గాయి. ఆఫ్రికాలో 11 శాతం వరకు కేసులు తగ్గుముఖం పట్టగా మిగతా రీజియన్లలో కొత్త కేసులు పెరి గాయని పేర్కొంది. బ్రిటన్, అమెరికా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నా యని తరువాతి దశ ఏ విధంగా ఉంటుందో చెప్పలేమన్నారు. ఈ వారం అమెరికాలో 78 శాతం , ఐరోపా దేశాల్లో 31 శాతం వరకు కరోనా కొత్త కేసులు పెరిగాయని, మరణాలు 10 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 

 

కొత్త వ్యాక్సిన్లు అవసరమన్న డబ్ల్యుహెచ్ఓ....

ఒమిక్రాన్ లేదా భవిష్యత్తులో సంక్రమించే మరే వేరియంట్లనైనా అత్యంత ప్రభావవంతంగా నియంత్రించగల సామర్ధ్యం కలిగిన కొత్త వ్యాక్సిన్లను తక్షణం రూపొందించవలసిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ సీనియర్ అధికారి మరియా వాన్ ఖెర్కోవ్ సూచించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన స్థాయిలో వ్యాక్సిన్లు ఆమేరకు నిరంతం రక్షణ కల్పిస్తాయన్న భరోసా లభించాలని పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా డెల్టా వేరియంట్‌ను అధిగమించి ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యాన్ని సాధిస్తోందని, ఇతర వేరియంట్లతో పోలిస్తే వ్యాధి తీవ్రత తక్కువ గానే ఉన్నప్పటికీ ఇమ్యునిటీని తప్పించుకునే చాకచక్యం ఒమిక్రాన్‌కు ఉన్నట్టు సాక్షాధారాలు పెరుగుతున్నాయని మరియా వాన్ ఖెర్కోవ్ హెచ్చరించారు.  ఇదివరకటి కరోనా వేరియంట్ల కంటే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తక్కువ లోనే రెట్టింపు సమయం వ్యాప్తిని చూపిస్తోందని, వ్యాక్సిన్ పొందినా, లేదా ఇదివరకు సార్స్ కొవి 2 సంక్రమించినా ఆయా వ్యక్తుల్లో కూడా దీని వ్యాప్తి వేగంగా కనిపిస్తోందని ఖెర్కోవ్ తెలియచేశారు. ఎక్కడైతే జన్యుక్రమం సరిగ్గా ఉందో ఆ దేశాల్లో ఒమిక్రాన్ కనుగొనడమౌతోందని, ఇంకా ప్రపంచం లోని ఇతర దేశాల్లోనూ ఇది విస్తరిస్తుందని చెప్పారు. దీని తీవ్రత తక్కువే అన్న సమాచారం ఉన్నప్పటికీ దీనివల్ల ఇంకా ప్రజలు ఆస్పత్రిపాలు అవుతుండడంతో ఇది తేలికపాటి వ్యాధి కాదని వివరించారు. జనవరి 3 నుంచి 9 వరకు ప్రపంచం మొత్తం మీద 15 మిలియన్‌కు మించి కొత్త కేసులు పెరిగాయని, అంతకు ముందటి వారం కన్నా 55 శాతం ఎక్కువని తెలిపారు. గతవారం కొత్తగా 43,000 మంది మరణించారని, జనవరి 9 నాటికి కేసులు 304 మిలియన్ వరకు నిర్ధారణ కాగా, 5.4 మిలియన్ వరకు మరణాలు సంభవించాయని చెప్పారు. కొత్త కేసులు అత్యధికంగా 46,10,359 వరకు అమెరికాలో బయటపడి 73 శాతం ఎక్కువగా నమోదయ్యాయని వివరించారు


 


2022-01-13  News Desk