ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది కరోనా నుంచి క్రమంగా కోలుకుందని.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రభుత్వానికి పన్నుల రూపంలో వసూళ్లు మెరుగుపడ్డాయని చెబుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం నుంచి క్రమంగా పన్ను వసూళ్లు మెరుగుపడ్డాయి. అదే ద్వితీయార్థానికి వచ్చే సరికి ఇవి మరింత పుంజుకున్నాయి. ప్రభుత్వం పన్ను వసూళ్ల ర్లక్ష్యానికి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థ నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుందని ఆర్థికమంత్రిత్వశాఖ నిర్వహించిన సమీక్షలో ఈ విషయాలను వెల్లడించింది.
గత ఆర్థిక సంవత్సరం 2020-21 లో స్థూలదేశీయోత్పత్తి లేదా జీడీపీ - 7.3 శాతానికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం గత ఏడాది కోవిడ్ - 19 మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో.. వ్యాపార కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రప్రభావం చూపించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం 2021-22 ప్రథమార్థంలో డీజీపీ 13.7 శాతంగా నమోదైంది.. ప్రభుత్వానికి పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చి పెట్టింది. భారత్ ఇప్పటిక కరోనా మొదటి వేవ్ , రెండో వేవ్‌ల నుంచి కోలుకుంది. కాబట్టి ఇక ఆర్థిక వ్యవస్థ మరింత బలపడి ప్రభుత్వానికి పన్నుల రూపంలో వసూళ్లు పుంజకుంటాయని ఆర్థిక మంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది. పన్ను వసూళ్లను బట్టి చూస్తే.. క్రమంగా దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థికమంత్రిత్వశాఖ వెల్లడించింది.
ప్రత్యక్ష పన్నులు.. పరోక్ష పన్నులు
కాగా ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నులు.. పరోక్ష పన్నులు రెండు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భాగా పుంజుకున్నాయి. ప్రత్యక్ష పన్నుల విషయానికి వస్తే వాటిలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతో పాటు కార్పొరేట్ పన్ను వసూళ్లు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 83.7 శాతం పెరిగాయి. పరోక్ష పన్నుల విషయానికి వస్తే వాటిలో జీఎస్టీ , సర్వీస్ టాక్స్ , ఎక్సైజ్ డ్యూటీ , కస్టమ్స్ డ్యూటీ తదితరాలు 48 శాతం వరకు పెరిగాయి.
ప్రభుత్వం వ్యయం.. ద్రవ్యలోటు
అయితే ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో వ్యయం కాస్తా తగ్గించింది. కేంద్రప్రభుత్వం రూ. 16.26 లక్షల కోట్లు వ్యయం చేయగా.. మొత్తం ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లక్ష్యంలో ఇది కేవలం 46.7 శాతంగా తేలింది. గత ఐదు సంవత్సరాల గణాంకాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. వాస్తవానికి ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో బడ్జెట్ అంచనాల్లో 52.2 శాతం వ్యయం చేయాల్సిఉంటుంది.
కాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వ్యయం అంచనా రూ. 34.83 లక్షల కోట్లు లక్ష్యంగా నిర్ణయించింది.కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం అక్టోబర్ చివరి నాటికి ద్రవ్యలోటు 42.6 శాతం లేదా రూ. 5.5 లక్షల కోట్లని తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో బడ్జెట్ అంచనాలో ఇది 36 శాతమని పేర్కొంది. కాగా కేంద్రప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును రూ. 15 లక్షల కోట్లు లేదా జీడీపీ 6.8 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇక్కడ ద్రవ్యలోటు అంటే ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ .. వ్యయానికి మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటుగా గమనించాలి. ప్రభుత్వం పన్ను వసూళ్లను పెంచుకోవడంతో పాటు ప్రభుత్వం వద్ద నిరుపయోగంగా ఉన్న ఆస్తులను విక్రయించి ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చుకోవాలని చూస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 4.5 శాతానికి పరిమితం చేస్తామని ప్రకటించారు. కరోనా వల్ల ద్రవ్యలోటును అదుపులోకి తేలేకపోయామని ఆమె వివరణ ఇచ్చారు.