ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టాప్-4లో సుస్థిర చోటే లక్ష్యంగా దూసుకెళుతున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) వరుస విజయాల జోరు కొనసాగించేందుకు తహతహలాడుతున్నది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ తమదైన జోరు కనబరుస్తున్న హెచ్ఎఫ్సీ..ఎస్సీ ఈస్ట్బెంగాల్తో గురువారం తలపడనుంది. బాంబోలిమ్ స్టేడియం (గోవా) వేదికగా జరిగే మ్యాచ్‌లో హెచ్ఎఫ్సీ ఎలాగైనా గెలువాలన్న పట్టుదలతో కనిపిస్తున్నది. ఎఫ్‌సీ గోవాతో జరిగిన గత మ్యాచ్‌ను 1-1 తో డ్రా చేసుకున్న హైదరాబాద్..నిలకడలేమితో సతమతమవుతున్న ఈస్ట్బెంగాల్ను ఓడించాలన్న కసితో కనిపిస్తున్నది. ఇప్పటి వరకుఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, రెండు డ్రాలు, ఒక ఓటమితో 11 పాయింట్లతో ప్రస్తు తం పాయింట్ల పట్టికలో హెచ్ఎఫ్సీ మూడో స్థానంలో కొనసాగుతున్నది. మరోవైపు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు ఓటములు, మూడు డ్రాలతో మూడు పాయింట్లతో ఇప్పటి వరకు గెలుపు ఖాతా తెరువని ఈస్ట్ బెంగాల్ ఆఖరి స్థానంలో ఉంది. తమదైన దూకుడు కొనసాగించేందుకు హెచ్ఎఫ్సీ పక్కా ప్రణాళికను ఎంచుకుంటే..ఎలాగైనా బోణీ కొట్టాలన్న పట్టుదల ఈస్ట్ బెంగాల్ జట్టులో కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది.
ప్రతీ మ్యాచ్ కీలకమే:
ఈస్ట్బెంగాల్తో మ్యాచ్ సందర్భంగా బుధవారం హెచ్ఎఫ్సీ చీఫ్ కోచ్ మనాలో మార్వె్కజ్ మీడియాతో మాట్లాడుతూ ‘లీగ్ లో ప్రతీ మ్యాచ్ మాకు కీలకమే. ఐఎస్ఎల్లో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఈస్ట్ బెంగాల్ తో మ్యాచ్‌ను కూడా మేం అదే స్థాయిలో తీసుకుంటాం. లీగ్‌లో ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. ఏ జట్టు అయినా..ఇంకో జట్టును ఓడించే సామర్థ్యం కనిపిస్తున్నది. అందువల్ల ప్రత్యర్థికి తగ్గట్లు వ్యుహాలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతాం. ఇప్పటి వరకు ఈస్ట్‌బెంగాల్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చుకపోయినా..మూడు మ్యాచ్‌లను వాళ్లు డ్రాగా ముగించుకున్నారు. బెంగాల్ జట్టులో మంచి ప్లేయర్లు ఉన్నారు. అందుకే పక్కా ప్రణాళికను ఎంచుకుని బరిలోకి దిగుతాం.
టాప్-4 లక్ష్యంగా:
హెచ్ఎఫ్సీ టాప్-4 లక్ష్యంగా దూసుకెళుతున్నది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మూ డు అద్భుత విజయాలు సొంతం చేసుకున్న హైదరాబాద్..ఎలాగైనా సెమీఫైనల్ బెర్తును దక్కించుకోవాలనే కసితో కనిపిస్తున్నది. ఏ మ్యాచ్‌ను సులువుగా తీసుకోకుండా అంతిమంగా గెలుపే లక్ష్యంగా ఎంచుకుంటూ మనాలో నేతృత్వంలోని హైదరాబాద్ గత సీజన్‌కు భిన్నంగా ముందుకు సాగుతున్నది. ఈ గెలుపు జోరు ఇలాగే కొనసాగితే..హెచ్‌ఎఫ్‌సీకి అడ్డు ఉండకపోవచ్చు.
వీరు జోరు కొనసాగిస్తే అదుర్స్:
జువానన్, చింగ్లేన్సన కోన్శామ్, ఆకాశ్ మిశ్రా, గోల్‌కీపర్ లక్ష్మికాంత్ కట్టిమణి తమదైన జోరు కొనసాగిస్తే..ఈస్ట్ బెంగాల్‌కు తిప్పలు తప్పకపోవచ్చు. గోవాతో మ్యాచ్‌లో జోయల్ చియానీస్, నిఖిల్ పూజరి అద్భుతమైన ఆటతీరు కనబరిచారు. మరోవైపు స్టార్ స్ట్రెకర్ ఓగ్బాచె ఐదు గోల్స్‌తో లీగ్‌లో టాప్ స్కోరర్ రేసులో దూసుకెళుతున్నాడు. ఇదిలా ఉంటే మహమ్మద్ యాసిర్, హలీచరణ్ నర్జారీ లేకుండానే హెచ్ఎఫ్సీ బరిలోకి దిగుతున్నది. నార్త్ఈస్ట్తో మ్యాచ్‌లో రెడ్‌కార్డ్‌కు గురైన అంటానియో పెర్సోవిచ్ లేకుండా ఈస్ట్ బెంగాల్..హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైంది.