కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో క్రమంగా విస్తరిస్తున్నాయి. ఓ వైపు క్రిస్మస్, న్యూఇయర్ సంబరాలకు సిద్ధమవుతున్న తరుణంలో ఒమిక్రాన్ కేసులు పెరుగు తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపధ్యంలో తాజా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. తాజా పరిస్థితులు ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దేశంలో మళ్ళీ ఆంక్షలు, లాక్ డౌన్ విధిస్తారేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
15 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ విస్తరణ
దేశంలో ఇప్పటికే 250 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద 15 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో 125 కేసులు నమోదయ్యాయి. దీంతో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై ఆంక్షలు విధించారు. పెళ్ళిళ్లు ఇతర సామూహిక కార్యక్రమాల్లో కూడా 200 మందికి మించకుండా ఉండాలని దిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దిల్లీలో ఆరు నెలల్లో అత్యధిక కేసులు నమోదవడం ఇదే ప్రధమం.
దిల్లీ తర్వాత అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర 65, తెలంగాణ 24, కర్ణాటక 24, రాజస్థాన్ 21, తమిళనాడు 34, కేరళ 15, గుజరాత్ లో 19 కేసులు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో మూడు ఓమిక్రాన్ కేసులు నమోదవగా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, లడఖ్, పశ్చిమ బెంగాల్ లో రెండు కేసుల చొప్పున నమోదయ్యాయని గణాంకాలు తెలుపుతున్నాయి
సామూహిక కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరని ముంబై కార్పొరేషన్ ఆదేశాలిచ్చింది. టీకా పొందిన సర్టిఫకెట్ ను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వాలని పంజాబ్ నిర్ణయించింది. టీకా పూర్తిగా పొందనివారిని జనవరి 1 నుంచి దుకాణ సముదాయాలు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లకు అనుమతించకూడదని హరియాణ సర్కారు ఉత్తర్వులిచ్చింది.
రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
ఒమిక్రాన్ విస్తరణ క్రమంగా పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాత్రిళ్ళు కర్ఫ్యూ విధించాలని, సామూహిక సమావేశాలు, గుమికూడడం వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని సూచంచింది. కోవిడ్-19 ప్రభావిత జనాభా, భౌగోళిక వ్యాప్తి, ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, కంటైన్మెంట్ జోన్లను ప్రకటించడం, జిల్లా స్థాయిలలో కంటైన్మెంట్ జోన్ల పరిధులు, సంబంధిత డేటాను సమీక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఇన్ఫెక్షన్ ను కట్టడి చేసేందుకు తగిన వ్యూహాలను రూపొందించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. 'వార్ రూమ్లను ఏర్పాటు చేయాలని, పరిస్థితులను ఎప్పటకప్పుడు బేరీజు వేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటుండాలని సూచించింది.
విదేశాల్లో కూడా ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయేల్, దక్షిణాఫ్రికా, యుకె లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. అమెరికా లో కేసుల విస్తరణ పై ఆందోళన వ్యక్తమవుతోంది. క్రస్మస్, న్యూఇయర్ వేడుకలకు పరిమితులు పాటించాలని అధికార యంత్రాంగం సూచస్తోంది. చైనాలోని జియాన్ సిటిలో కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ విధించారు.