హిజాబ్, హలాల్ మాంస నిషేధం, లౌడ్ స్పీకర్ల లొల్లి కొనసాగుతుండగానే కర్నాటకలో మరో పంచాయితీ మొదలయ్యింది. ఉత్తర ప్రదేశ్ లో రామాలయాన్ని కూల్చి.. బాబ్రి మసీదు నిర్మించినట్లుగానే.. కర్ణాటక శ్రీరంగపట్నం పట్టణంలో హనుమాన్ మందిరాన్ని కూల్చి మసీదును నిర్మించారనే ఆందోళన మొదలయ్యింది. ప్రస్తుతం కన్నడ నాట జామియా మసీదు లొల్లి మొదలయ్యింది.
*టిప్పు పాలనలో ఆలయం కూల్చివేత
ఒకప్పుడు హనుమాన్ దేవాలయం ఉన్న ప్రదేశంలోనే జామియా మసీదు నిర్మించబడిందని కాళీ మఠానికి చెందిన రిషి కుమార్ స్వామి వెల్లడించారు. 1784లో హనుమాన్ మందిరాన్ని కూల్చివేసిన తర్వాత మసీదును నిర్మించారని ఆయన ఆరోపించారు. మసీదు లోపల పూర్వపు హొయసల రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు ఉన్నాయని వాదించారు. టిప్పు సుల్తాన్ కాలంలో హనుమాన్ ఆలయాన్ని మసీదుగా మార్చారని రిషి కుమార్ స్వామి తెలిపారు. అయితే జనవరి 2022లో జామియా మసీదును కూల్చివేయాలని పిలుపునిచ్చిన కాళీ మఠం స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని శ్రీరంగపట్నం పట్టణం జనతాదళ్ (సెక్యులర్)కి బలమైన ప్రాంతంగా కొసాగతోంది. అనేక హిందూ సంస్థలు ఈ పట్టణాన్ని మరో అయోధ్యగా పరిగణిస్తున్నాయి.
*తొలుత హిజాబ్ వివాదం
అటు కర్నాటకలో పాఠశాలలు, కళాశాలల్లో తరగతులకు హాజరైనప్పుడు హిజాబ్ ధరించే మతపరమైన హక్కుపై చర్చ కొనసాగుతుండగా ఈ మసీదు వివాదం చెలరేగింది. తొలుత విద్యా సంస్థల్లో ముస్లీంలు హిజాబ్ ధరించడాన్ని బ్యాన్ చేయాలని కొన్ని హిందూ సంస్థలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ మొదలు పెట్టాయి. ముస్లీంలు హిజాబ్ ధరిస్తే.. తాము కాషాయ కండువాలు వేసుకుని వస్తామని ఆయా విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. కొన్ని చోట్ల ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం కూడా చెలరేగింది. మరికొన్ని ప్రాంతాల్లో భౌతిక దాడులకు దిగారు. అటు హిజాబ్ వివాదం మీద కర్నాటక హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ముస్లీంలు హిజాబ్ ధరించడం తప్పని సరి కాదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ వివాదం కాస్త సర్దుమణిగింది.
*హలాల్ మాంసం ఆందోళన
హిజాబ్ వివాదం కాస్త చల్లబడగానే హిందూ జనజాగృతి సమితి, శ్రీరామ సేన, బజరంగ్ దళ్ సహా మరికొన్ని మితవాద సంఘాలు మరో ఆందోళనకు పిలుపునిచ్చాయి. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని కోరుతూ ప్రచారాలు నిర్వహించాయి. హలాల్ మాంసాన్ని విక్రయించడం ఆర్థిక జిహాద్ అని వ్యాఖ్యానించి బిజెపి జాతీయ కార్యదర్శి సిటి రవి అగ్నికి ఆజ్యం పోశారు. పలు చోట్ల చికెన్ సెంటర్ల నిర్వాహకులపై దాడులు జరిగాయి.
*లౌడ్ స్పీకర్ల లొల్లి
హలాల్ మాంసం ఆందోళన తర్వాత ఆజాన్, హనుమాన్ చాలీసా వివాదం కూడా మొదలయ్యింది. ఈ నేపథ్యంలో లౌడ్ స్పీకర్ల వాడకంపై కర్ణాటక ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్లను ఉపయోగించరాదని ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు. లౌడ్ స్పీకర్లకు సంబంధించిన అనుమతి తప్పని సరి అని వెల్లడిచారు. ఆయా ప్రార్థనా మందిరాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగానికి సంబంధించిన అనుమతి పొందిన తర్వాతనే వాటిని వాడాల్సి ఉంటుందని చెప్పారు.